నా పాటల్లో తప్పులుంటే ఎత్తి చూపండి : ఇళయరాజా
''నా పాటల్లో తప్పులుంటే ఎత్తి చూపండి, సరిదిద్దుకుంటాను. ఇతరుల సంగీతం గురించి అడిగితే నేనెలా చెప్పగలను?'' అంటూ సమాధానం ఇచ్చారు సంగీత దర్శకుడు ఇళయరాజా. ప్రకాష్ రాజ్ దర్శకత్వంలో రూపొందిన 'ధోని' ఆడియో వేడుకలో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన ఆయన మీడియాతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇచ్చారు. మీకు ఎవరు పోటీ అని భావిస్తున్నారు అని అడగ్గా...నేను ఎవరితోనూ పోటీ పెట్టుకోను, ఎవర్నీ అధిగమించాలని అనుకోను అని సమాధాం ఇచ్చారు.
నాకు కథలు నచ్చకుంటే పాటలు ఇవ్వడానికి ఒప్పుకోను, ఓ సారి హీరో కమల్ హాసన్ ఒక కథ చెప్పారు. అందులో మొత్తం వయోలెన్స్ ఉంది. నేను చెయ్యడానికి ఏముంటుంది? చెయ్యనని చెప్పాను. ఇలా చాలా సినిమాలు వదిలేశాను అని వెల్లడించారు. ప్రస్తుతం లైవ్ ఇనుస్ట్రుమెంట్స్ కన్నా ఎలక్ట్రానిక్ వాయిద్యాల హవా కొనసాగుతున్న మాట వాస్తవమే. కానీ మిషన్స్ లో మనసు ఉండదు. ఎలక్ట్రానిక్స్ వచ్చిన తర్వాత పని స్లో అయింది అని చెప్పారు. నా గురించి నాకు గొప్ప అభిప్రాయం లేదు, ఆటో బయోగ్రఫీ రాసే ఆలోచన తనకు లేదన్నారు. మీ జీవితాశయం ఏమిటని అడ్డగా....ఏమీ లేదు, మరో జన్మ ఉండకూడదని కోరుకుంటాను అన్నారు.
ఈ ఆడియో వేడుకలో దర్శకుడు ప్రకాష్ రాజ్, ఇళయారాజ, రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి, మాస్టర్ ఆకాష్ తదితరులు పాల్గొన్నారు. పూరి జగన్నాథ్ తనయుడు ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ప్రకాష్ రాజ్, రాధిక ఆప్టే, నాజర్ బ్రహ్మానందం, గొల్లపూడి మారుతీరావు తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.


Click it and Unblock the Notifications











