ప్రకాష్ రాజ్ దర్శకత్వంలో మరో సినిమా
విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న ప్రకాష్ రాజ్ సినిమా రంగంలోని ఇతర విభాగాల్లోనూ వేలు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నిర్మాత, దర్శకుడిగా తన సత్తా చాటాడు. ఇప్పటికే కన్నడ వెర్షన్ 'ఆకాశమంత' చిత్రానికి దర్శకత్వం వహించగా, తెలుగులో 'ధోనీ' చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. తాజాగా మరో సినిమాకు దర్శకత్వం వహించ బోతున్నాడు ఈ గ్రేట్ యాక్టర్.
ప్రస్తుతం ప్రకాష్ రాజ్ సల్మాన్ ఖాన్ దబాంగ్-2 చిత్రంలో నటిస్తున్నాడు. ఇక్కడ షూటింగ్ ముగియగానే పూరి దర్శకత్వంలో రవితేజ హీరోగా రూపొందుతున్న 'దేవుడు చేసిన మనుషులు' షూటింగులో భాగంగా బ్యాంకాక్ వెళ్లబోతున్నాడు. అక్కడ ప్రకాష్ రాజ్ మూడు వారాల పాటు స్పెండ్ చేయనున్నాడు. సినిమా షూటింగ్‌లో పాల్గొనడంతో పాటు...తను తర్వాత దర్శకత్వం వహించబోయే చిత్రానికి సంబంధించి కసరత్తు చేయనున్నాడట. ఈ విషయాన్ని ప్రకాష్ రాజ్ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
అక్కడ పని పూర్తి కాగానే...ప్రకాష్ రాజ్ మళ్లీ ఇక్కడికి తిరిగి వచ్చి మహేష్ బాబు, వెంకటేష్ మల్టీ స్టారర్ గా రూపొందుతున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం షూటింగులో జాయిన్ కాబోతున్నాడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.
ఇప్పటికే తను దర్శకత్వం వహించిన రెండు చిత్రాల్లో తనదైన ముద్ర వేసిన ప్రకాష్ రాజ్...తన మూడో ప్రాజెక్టును విభిన్నంగా ప్లాన్ చేస్తున్నాడు. కమర్షియల్ అంశాలతో పాటు విలువలతో కూడిన చిత్రాన్ని ప్రకాష్ రాజ్ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











