ఎన్టీఆర్ బయోపిక్, పేట మాత్రమే మిగులుతాయి.. మిగిలినవాళ్లు చూసుకోండి, పందులు గుంపులుగా!
పేట చిత్రం జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఆదివారం హైదరాబాద్ లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. రజనీ అమెరికాలో ఉండడం వలన ప్రీరిలీజ్ ఈవెంట్ కు హాజరు కాలేదు. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదుల చేయనున్నారు. ప్రీరిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ నిర్మాత ప్రసన్న కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. అశోక్ వల్లభనేని తరహాలోనే వివాదభరిత వ్యాఖ్యలు చేశారు.

రజనీకాంత్‌కు ప్రాంతం లేదు
సినీ నటుడు ఎక్కడైనా చరిత్ర సృష్టించగలరు అని సూపర్ స్టార్ రజనీకాంత్ నిరూపించారని ప్రసన్నకుమార్ అన్నారు. మహారాష్ట్రలో పెరిగిన రజినీకాంత్, కర్ణాటకలో బస్సు కండెక్టర్ గా పనిచేసి, తమిళనాడులో సూపర్ స్టార్ గా ఎదిగారు. సినిమా బావుంటే ఎవ్వరూ అడ్డుకోలేరు అని పేట చిత్రాన్ని ఉద్దేశించి అన్నారు. ప్రస్తుతం థియేటర్స్ మాఫియా దారుణంగా తయారైంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు,

ఆ ముగ్గురూ కలసి
కేవలం ఇండస్ట్రీలో ఉన్న ఆ ముగ్గురూ కలసి థియేటర్స్ ని మొత్తం ఆక్రమించుకుంటున్నారని ప్రసన్నకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతికి 6 సినిమాలు విడుదలైనా ప్రేక్షకులు ఆదరిస్తారు. కానీ రెండు సినిమాలకు మాత్రమే థియేటర్స్ ని ఆక్రమిస్తూ మిగిలిన చిత్రాలకు అవకాశం లేకుండా చేస్తున్నారని ప్రసన్న కుమార్ ఫైర్ అయ్యారు. ఇలాంటి పనులు మానండి. రిక్వస్ట్ అనుకోండి, వార్నింగ్ అనుకోండి. చాలా మందిని చూశాం. అయిపోతారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మిగిలిన వాళ్ళు చూసుకోండి
సూపర్ స్టార్ రజినీకాంత్ కేవలం ఇద్దరు దేవుళ్ళ కాళ్లకు మాత్రమే దండం పెడతారు. ఒకరు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని ప్రసన్న కుమార్ అన్నారు. రజనీకాంత్ దండం పెట్టె మరొక దైవం రాఘవేంద్ర స్వామి అని తెలిపారు. అలాంటి ఎన్టీఆర్ చరిత్ర బయోపిక్ చిత్రంగా రాబోతోంది. ఈ సంక్రాంతికి ఎన్టీఆర్ బయోపిక్, పేట చిత్రాలు మాత్రమే చరిత్ర సృష్టిస్తాయి. ఆ రెండు చిత్రాలు మాత్రమే బాక్సాఫీస్ వద్ద మిగులుతాయి. మిగిలిన వాళ్ళు చూసుకోండి. పందులు గుంపులుగా వస్తాయి.. సింహం సింగిల్ గా వస్తుంది అని రజిని అప్పుడే చెప్పారు.

ప్రపంచం మొత్తాన్ని
పేట చిత్రం గురించి మాట్లాడుతూ.. విభిన్న చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్ సుబ్బరాజ్ ఒక అభిమానిగా రజినీతో పేట చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక సంగీత దర్శకుడు అనిరుద్ ధనుష్ తో చేసిన కొలవెరి సాంగ్ ప్రపంచం మొత్తాన్ని డాన్స్ చేసే విధంగా చేసిందని ప్రసంశించారు. హీరోగా వరుస విజయాలు సాధిస్తున్న విజయ్ సేతుపతి రజనీకాంత్ కోసం ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించారు.


Click it and Unblock the Notifications











