రజనీ స్థానంలో ప్రియమణి!!!
ఆయనేమో తమిళ సూపర్ స్టార్. ఆమేమో కొత్తకొత్త అందాలతో తమిళ, తెలుగు పరిశ్రమలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్న యువ తార. ఆయనేమో రజనీకాంత్, ఆమేమో ప్రియమణి. ఇద్దరికి సంబంధించిన వార్తేమిటా..అనుకుంటున్నారా. అంత సంచలన వార్తేమీ కాదుకానీ...అంతటి రజనీకాంత్ స్థానంలో ప్రియమణిని ఎంపికచేశారు. వివరాలలోకి వెళదాం...గోవాలో నవంబర్ 23నుంచి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(ఐ.ఎఫ్.ఎఫ్.ఐ)ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభం కానున్నది. ఈ ఉత్సవాలను సంప్రదాయబద్ధంగా ప్రారంభించడానికి షారూక్ ఖాన్ తో పాటు ప్రియమణిని ఎంపిక చేశారు. ప్రియమణికి నిజంగా ఇది గొప్ప గౌరవంగా చెప్పవచ్చు. ఈ అవకాశమేం అంత సులభంగా రాలేదు...ఆమె పరుత్తివీరన్ లో కనపరిచిన ప్రతిభ కారణంగానే వచ్చింది. ఆ సినిమాలో నటించినందుకుగాను..న్యూఢిల్లీలో జరిగిన 9వ ఓసియన్ సినీ ఫ్యాన్ అవార్డ్ ఆమెకు వచ్చినందునే ఆమెను ఎంపిక చేశారు. నిజానికి ఈ ఉత్సవాలను ప్రారంభించే అవకాశం ముందుగా రజనీకాంత్ కే వచ్చింది. అయితే ఆయన దీనిని సున్నితంగా తిరస్కరించారు.
అంతర్జాతీయ ఉత్సవాలను ప్రారంభించే అవకాశం తనకే వచ్చిందంటే ప్రియమణి ఇంకా నమ్మలేకపోతోంది. ఆ వార్త నిజమా కాదా అనే విషయాన్ని రూఢీ చేసుకున్న తరువాత ప్రియమణి తన సంతోషాన్ని స్నేహితులతో, దర్శకుడు అమీర్ తో పంచుకుంది. షారూక్ ఖాన్ తో స్టేజీ పంచుకునే అవకాశం తనకు లభించడమంటే అంత ఆశామాషీ కాదని అంటోంది. అదీ ఒక దక్షిణ భారత నటీమణికి అని అంటోంది. అంతేకాదు సూపర్ స్టార్ కు వచ్చిన అవకాశాన్ని అందరిని కాదని తనకు ఇవ్వడం చాలా ఆశ్చర్యంగా ఉందని ఆనందంగా చెబుతోంది.


Click it and Unblock the Notifications











