చెర్రీ సినిమాలో భారీగా హీరోయిన్ ఇంట్రడక్షన్ సాంగ్
ముంబై: సాధారణంగా హీరోల సినిమాల్లో హీరోయిన్స్ కు ఇంట్రడక్షన్ సాంగ్స్ ఉండటం అరుదు. అయితే రామ్ చరణ్ తాజా చిత్రం 'జంజీర్' లో హీరోయిన్ గా చేస్తున్నది ప్రియాంక చోప్రా కావటంతో ఆమెపై భారీగా ఇంట్రడక్షన్ సాంగ్ తీయక తప్పటం లేదు. అపూర్వ లఖియా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'జంజీర్'. గతంలో అమితాబ్ బచ్చన్ నటించిన చిత్రానికి రీమేక్ ఇది. బిగ్ బీ పోషించిన విజయ్ పాత్రలో రామ్‌చరణ్ నటిస్తున్నారు.
జయా బచ్చన్ పోషించిన మాల పాత్రలో ప్రియాంక చోప్రా కనిపించబోతోంది. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా పరిచయ గీతాన్ని భారీగా చిత్రీకరించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇందులో ఆమెతోపాటు వంద మంది యువకులు నృత్యం చేయనున్నారు. ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు ఈ పాటను ప్రత్యేకంగా చిత్రీకరించబోతున్నారు. గణేష్ ఆచార్య నృత్యరీతుల్ని సమకూరుస్తారు. మీట్ బ్రదర్స్ సంగీతం అందించిన గీతమిది.
విశ్వసనీయ సమాచారం మేరకు రామ్‌చరణ్‌పై కూడా హంగామాతో కూడిన పరిచయ గీతాన్ని రూపొందించేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అమిత్ మెహ్రా 'జంజీర్'ను నిర్మిస్తున్నారు. వేసవికి ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఇది తెలుగులోకీ అనువాదమయ్యే అవకాశాలున్నాయి.
జంజీర్ రీమేక్ లో రామ్ చరణ్.. విజయ్ గా కనిపించనున్నాడు.. మాలాగా ప్రియాంక చోప్రా, తేజగా ప్రకాష్ రాజ్ చేస్తున్నారు. ఇక షేర్ ఖాన్ పాత్రలో సంజయ్ దత్, మోనా గా మహీ గిల్ కనిపించి అలరించనున్నారు. ఆయిల్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ కాలానికి తగినట్లు అప్ డేట్ చేసి స్క్రిప్టు రాసి మరీ తీస్తున్నట్లు దర్శకుడు అపూర్వ లఖియా చెప్తున్నారు. ఈ చిత్రాన్ని రిలయెన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు అమిత్ మెహ్రా నిర్మిస్తున్నాడు. పాత 'జంజీర్' దర్శకుడు ప్రకాశ్ మెహ్రా కుమారుడే ఈ అమిత్. తన తండ్రి సాధించిన విజయాన్ని ఈ చిత్రంతో కొనసాగించలనుకుంటున్నాని చెప్తున్నాడు.


Click it and Unblock the Notifications











