ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయితే.. ఒక రౌండ్ మందు ఎక్కువగా తాగి.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ స్పీచ్
ప్రముఖ నిర్మాణ సినీ నిర్మాణ సంస్థ స్వప్న సినిమా బ్యానర్‌లో డైరెక్టర్ నందినిరెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అన్నీ మంచి శకునములే. మిత్ర విందా మూవీస్‌తో కలిసి ప్రియాంక దత్, స్వప్న దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
నిర్మాతలు అశ్వినీదత్, అల్లు అరవింద్, దర్శక, నిర్మాత రాఘవేంద్రరావు స్నేహానికి 30 ఏళ్లు నిండిన సందర్బంగా అన్నీ మంచి శకునములే సినిమా బంతి భోజనం పేరుతో వినూత్నంగా ప్రమోషనల్ కార్యక్రమాన్ని నిర్మించింది. ఈ సందర్భంగా నిర్మాత అశ్వినీదత్ మాట్లాడుతూ..
45 సంవత్సరాల క్రితం: నా జీవితంలో ఎన్నో ఫంక్షన్లకు వెళ్లాను. కానీ నా జీవితంలో మరిచిపోలేని ఫంక్షన్ ఇది. 45 సంవత్సరాల క్రితం సినిమా తీద్దామని విజయవాడ నుంచి చెన్నైకి వెళ్తుంటే.. మా డిస్టిబ్యూటర్స్ నవయుగ వాళ్లు పిలిచి ఓ మాట చెప్పారు. రామలింగయ్య గారి అబ్బాయిని పరిచయం చేసుకో. చాలా తెలివిగల అబ్బాయి. ఆయనతో ఫ్రెండ్‌షిప్ చేసుకో. అంతా సక్సెస్‌పుల్‌గా ఉంటావని చెప్పారని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ తెలిపారు.

పెళ్లి సందడి లాభాలను అలా: మద్రాస్‌కు వెళ్లిన తర్వాత మా బంధుత్వంతో రాఘవేంద్రరావు, ఆ తర్వాత అల్లు అరవింద్ గారు పరిచయం అయ్యారు. అలా పరిచయమైన తర్వాత చాలా సంవత్సరాలకు 1 కోటి 20 లక్షల రూపాయలతో పెళ్లి సందడి తీశాం. ఆ సినిమా 14 కోట్లు వసూలు చేసింది. మేమే డిస్టిబ్యూటర్లం కాబట్టి మేమే ఆ లాభాలను పంచుకొన్నాం అని అశ్వినీదత్ తెలిపారు.

రాఘవేంద్రరావు వద్దన్నా.. హిందీ సినిమా తీస్తే: ఆ తర్వాత అల్లు అరవింద్ గారు కలిసి.. హిందీలో కల్‌కత్తా మెయిల్ అనే సినిమా తీశాం. అయితే మేము పెళ్లి సందడిలో సంపాదించిన డబ్బు కంటే ఎక్కువగానే పోయాయి. అయినా మేము కుమిలిపోలేదు. చెరో ఒక్క రౌండ్ అదనంగా మందు తాగి ఇంటికి వెళ్లాం అని అశ్వినీదత్ చెబుతుంటే.. నేను ఆ సినిమా తీయవద్దని చెప్పాను అంటూ రాఘవేంద్రరావు అన్నారు. దాంతో రాఘవేంద్రరావు చెప్పిన విషయం కరెక్టే అంటూ అశ్వినీదత్ అన్నారు.

ఆ సినిమాలే నాకు సంతృప్తికరంగా: స్వప్న సినిమాపై గానీ, సిరి మీడియా మీద గానీ, రాఘవేంద్ర మూవీ కార్పోరేషన్ గానీ ఎన్నో గొప్ప సినిమాలు తీశాం. నేను నిర్మించిన మూవీస్ కంటే.. మా ముగ్గురి బ్యానర్‌లో నిర్మించిన సినిమాలే నాకు ఎక్కువ సంతృప్తిని కలుగజేశాయి అని అశ్వీనీదత్ అన్నారు. అన్ని మంచి శకునములే మూవీ ప్రెస్ మీట్‌లో అల్లు అరవింద్, రాఘవేంద్ర రావు స్పీచ్ వైరల్ అయ్యాయి.

ఆ ఇద్దరు రాక్షసులు వచ్చిన తర్వాత: నా జీవితంలో నా స్నేహితులు అరవింద్, రాఘవేంద్రరావు సినిమా నిర్మాణం విషయంలో వాళ్లు ముందుండే వాళ్లు. నేను వెనుక ఉండే వాడిని. ఇద్దరు రాక్షసులు (నా కూతుళ్లు ) వచ్చిన తర్వాత వాళ్లు ముందుంటున్నారు. నేను వెనుక ఉంటున్నాను అని అశ్వినీదత్ అన్నారు. పక్కనే ఉన్న అరవింద్.. ప్రియాంక, స్వప్నదత్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. సీతారామం సినిమా చూసిన తర్వాత మూడు సార్లు ఏడ్చాను. రెండు సార్లు సినిమాలో ఎమోషన్స్ చూసి.. మరోసారి ఇంత మంచి సినిమా తీయలేదనే బాధతో అని అల్లు అరవింద్ అన్నారు.


Click it and Unblock the Notifications











