మూవీ మేకింగ్‌లో ఏఐ టెక్నాలజీ .. అంతా ప్రిపేర్ కావాల్సిందే , స్టార్ ప్రొడ్యూసర్ హాట్ కామెంట్స్
గడిచిన కొద్దినెలలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేథస్సు)పై ప్రపంచవ్యాప్తంగా టెక్ సెక్టార్‌లో చర్చ జరుగుతోంది. చాట్‌జీపీటీ, బార్డ్, బింగ్ వంటి చాట్‌బాట్స్ పలు రంగాలపై పెను ప్రభావం చూపుతున్నాయి. ఎంతటి సంక్లిష్టమైన పనులైనా సరే సదరు ఏఐ టూల్స్ చిటికెలో చక్కబెడుతూ శెభాష్ అనిపించుకుంటోంది. ఈ దెబ్బకు మైక్రోసాఫ్ట్, గూగుల్, ట్విట్టర్, అమెజాన్ వంటి టెక్ దిగ్గజాలు ఏఐ టూల్స్‌ను ప్రత్యేకంగా తీసుకొస్తున్నాయి.
అయితే కత్తికి రెండు వైపులా పదును ఉన్నట్లుగా ఏఐ టెక్నాలజీ తన వెంట మంచితో పాటు చెడు కూడా తీసుకొస్తోంది. వివిధ రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులకు కారణమవుతున్న కృత్రిమ మేథ కారణంగా రాబోయే రోజుల్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు ఊడుతాయని నిపుణులు, మేధావులు హెచ్చరిస్తున్నారు. ఏఐ విస్తరణను అడ్డుకుని కేవలం కొన్ని రంగాలకే దానిని పరిమితం చేయాలని వారు సూచిస్తున్నారు. దీనిని నియంత్రించేందుకు మేధావులు ఇప్పటికే రంగంలోకి దిగినట్లుగా వార్తలు వస్తున్నాయి.

అన్ని రంగాలతో పాటే సినీ రంగంలోనూ ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ అడుగుపెట్టింది. ఇటీవల హాలీవుడ్ రచయితలు, నటీనటులు ఏఐ టెక్నాలజీ వినియోగంపై ఆందోళన వ్యక్తం చేశారు. దీని వల్ల తమ ఉపాధికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అటు భారతీయ చిత్ర పరిశ్రమ సైతం కృత్రిమ మేథను అందిపుచ్చుకుంటోంది. శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన భారతీయుడు -2లో ఏఐని వాడారు.
అలాగే సత్యరాజ్ నటించిన వెపన్‌లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఓ సీక్వెన్స్‌కు రూపకల్పన చేశారు. ఇందులో సత్యరాజ్‌ను యంగ్ ఏజ్‌లోకి తీసుకెళ్లే కొన్ని సన్నివేశాలను రూపొందించాల్సి రావడంతో కృత్రిమ మేధ సాయం తీసుకున్నారు. ఇదిలాఉండగా ..తెలుగునాట అభిరుచి గల నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కేఎస్ రామారావు ఇటీవల ఓ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఏఐ టెక్నాలజీపై కీలక వ్యాఖ్యలు చేశారు. దర్శకుడు తన ఊహలను సెల్యూలాయిడ్‌పై ఆవిష్కరించగల స్థాయిలో సాంకేతికత అందుబాటులోకి వచ్చిందన్నారు.

ఖర్చు భరించగలిగితే చాలు అద్భుతాలు సృష్టించవచ్చని.. ఆర్టిస్టులను ఇబ్బంది పెట్టకుండా సినిమాలు తీయవచ్చని, ఏఐ సాయంతో కలలో కూడా ఊహించనిది చూపించవచ్చని రామారావు తెలిపారు. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు ప్రిపేర్ అవ్వాలని, తగిన ఆర్ధిక వనరులను సిద్ధం చేసుకోవాలని ఆయన సూచించారు. సినిమా మేకింగ్ విషయంలో ప్రతి నిమిషం అలర్ట్‌గా ఉండే పరిస్ధితులు వచ్చేశాయని కేఎస్ రామారావు అన్నారు. సినిమాను ఒకేసారి 25 వేల మంది చూసే థియేటర్లు అందుబాటులో ఉన్నాయని, తెరపై ఉంది మనమేనా అనిపించే సినిమాలు రాబోతున్నాయని ఆయన తెలిపారు.


Click it and Unblock the Notifications











