పవన్ కల్యాణ్‌కు, బాలయ్యకు అలా.. ప్రభాస్‌కు ఇలానా? ఏపీ సర్కారుపై నట్టి ఫైర్
తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి టికెట్ల రేట్లు పెంపు విషయంలో ఏపీ ప్రభుత్వం ద్వంద వైఖరిని అవలంభిస్తున్నది అని చిన్న నిర్మాతల సంఘం అధ్యక్షుడు, నిర్మాత నట్టి కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ల రేట్లు పెంచడంలో ఓ హీరోకు ఒక రకంగా, మరో హీరోకు మరో రకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జనవరి 5వ తేదీన ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి పోసాని, తదితరులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ..
టికెట్ల రేట్ల పెంపు కోసం 100 కోట్ల బడ్జెట్ దాటితే పెంచాలని ఏపీ ప్రభుత్వం ఒక నిబంధన పెట్టుకొన్నది. పవన్ కల్యాణ్ నటించిన బ్రో సినిమా, అలాగే నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమాకు టికెట్ రేట్లు పెంచలేదు. కానీ ప్రభాస్ నటించిన సలార్ సినిమాకు పెంచారు అనే విషయాన్ని నట్టి కుమార్ మీడియా దృష్టికి తీసుకొచ్చారు.

చుట్టాలుంటే ఒక విధంగా, చుట్టాలు కాకపోతే మరో విధంగా చేస్తారా? రాజకీయాలను పక్కన పెడితే.. పవన్ కల్యాణ్ పెద్ద హీరో, బాలకృష్ణ పెద్ద హీరో. వారి సినిమాలకు ఎందుకు టికెట్ రేట్స్ పెంచలేదు. ప్రభుత్వం రూల్స్ పెట్టుకొంటే ఒకే విధంగా వ్యవహరించాలి. ప్రభాస్ సినిమాకు ఎందుకు పెంచారో ఎఫ్‌డీసీ చైర్మన్ పోసాని కృష్ణ మురళి సమాధానం చెప్పాలి అని అన్నారు.

ఎఫ్‌డీసీ చైర్మన్ హోదాలో ఎప్పుడు చంద్రబాబును తిట్టడం కాదు. పవన్ కల్యాణ్ దూషించడం కాదు. ఇలాంటి విషయాలపై ఆయన స్పందించాలి. మా ప్రశ్నలకు, ప్రేక్షకులు, అభిమానుల ప్రశ్నకు సమాధానం చెప్పాలి అని ఆయన డిమాండ్ చేశారు.
సినిమా బడ్జెట్ పెరగడానికి ప్రధాన కారణం నిర్మాతలు అవలంభించే వైఖరి మాత్రమే. హీరోలకు చార్టర్డ్ ఫ్లయిట్స్, బెంజ్ కార్లు ఎందుకు పెట్టాలి? ఖరీదైన కార్ వాన్లు ఎందుకు పెట్టాలి? ఇవన్నీ తగ్గించుకొంటే బడ్జెట్ కంట్రోల్‌లో ఉంటుంది. ఎందుకు బడ్జెట్ ఫెరిగిందనే విషయాన్ని నిర్మాతలు గుండెలపై చేయి వేసుకొని ప్రశ్నించుకోవాలి అని నట్టి కుమార్ అన్నారు.


Click it and Unblock the Notifications











