చిరంజీవిని జగన్ అవమానిస్తే ఖండించలేదే .. అల్లు అర్జున్‌పై నట్టికుమార్ ఫైర్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు చివరిరోజున ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ నంద్యాల వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకున్న సంగతి తెలిసిందే. తన ప్రాణమిత్రుడు వైసీపీ అభ్యర్ధి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్ధతు తెలుపుతూ ఆయనను గెలిపించాలని నంద్యాల వాసులను బన్నీ కోరారు. ఇది తెలుగు సినీ, రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.
సొంత మేనమామ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తుంటే చిన్న ట్వీట్‌తో సరిపెట్టిన అల్లు అర్జున్.. మిత్రుడి కోసం నంద్యాల వెళ్లడం ఏంటంటూ మెగా, జనసేన అభిమానులు మండిపడుతున్నారు. అదే రోజున రాంచరణ్ తన తల్లితో కలిసి పిఠాపురం వెళ్లి పవన్‌కు సంఘీభావం ప్రకటించడం మరింత అగ్గిని రాజేసి సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు దారితీసింది.

ఈ వివాదంపై అల్లు అర్జున్ స్పందించారు. తనకు ఏ పార్టీతోనూ సంబంధం లేదని, నా అనుకునే వాళ్లకు తప్పకుండా నా మద్ధతు ఉంటుందన్నారు. మేనమామ పవన్ కళ్యాణ్, ఫ్రెండ్ శిల్పా రవి, మా మావయ్య చంద్రశేఖర్ రెడ్డి, మా బన్నీ వాసు ఇలా ఎవరికైనా మద్ధుతగా ఉంటానని అల్లు అర్జున్ స్పష్టం చేశారు. శిల్పా రవి తనకు 15 ఏళ్లుగా ఫ్రెండ్ అని ఆయన రాజకీయాల్లోకి వస్తే తప్పకుండా ఊరుకి వచ్చి సపోర్ట్ చేస్తానని మాట ఇచ్చానని.. దీనిలో భాగంగానే భార్యతో కలిసి వెళ్లి రవికి విషెస్ తెలిపినట్లు అల్లు అర్జున్ స్పష్టం చేశారు.
అక్కడితో ఈ వివాదానికి తెరపడినట్లేనని అంతా భావిస్తున్న వేళ.. సోమవారం పోలింగ్ ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ట్విట్టర్ పిట్టకు పని చెప్పారు. '' మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైన పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే '' అంటూ ఆయన పోస్ట్ పెట్టాడు. ఇది పరోక్షంగా అల్లు అర్జున్‌ని ఉద్దేశించినదేనంటూ సినీ, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ పరిణామాలు మెగా క్యాంప్‌లో విభేదాలను మరోసారి బయటకు తెచ్చాయంటున్నారు నెటిజన్లు.
అల్లు అర్జున్ నంద్యాల వెళ్లడం, ఏపీలో ఎన్నికలు, సినీ పరిశ్రమ మద్ధతు తదితర అంశాలపై ప్రముఖ తెలుగు వార్తాసంస్థ ఓ చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది. దీనికి హాజరైన నిర్మాత నట్టికుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా రిలీజ్ అయినప్పుడు రూ.35కే టికెట్ విక్రయించారని దీని వల్ల డిస్ట్రిబ్యూటర్లంతా నష్టపోయారని ఆయన గుర్తుచేశారు. పవన్ నటించిన భీమ్లా నాయక్ సినిమాని ఎమ్మార్వోలు అడ్డుకున్నారని.. మరి ఆరోజున తన ఫ్రెండ్ శిల్పారవితోనో, వైఎస్ జగన్‌తోనో అల్లు అర్జున్ మాట్లాడలేదంటని నట్టికుమార్ ప్రశ్నించారు.
ఇండస్ట్రీ బాగు కోసం మెగాస్టార్ చిరంజీవి తాడేపల్లికి వెళ్లి చేతులు జోడించి అడుగుతుంటే పోసాని కృష్ణమురళి వీడియో లీక్ చేసి ఆయనను అవమానించిందని మండిపడ్డారు. ఆ రోజున ఇది తప్పు అని ఖండించి ఉంటే తామంతా సంతోషించేవాళ్లమని నట్టికుమార్ అన్నారు.
పుష్ప సినిమా నిర్మాత నష్టపోయి రోడ్డునపడుతున్నప్పుడు.. రూ.35 టికెట్ ఎవరైనా విక్రయిస్తారా అని ఆయన ప్రశ్నించారు. రూ.100కి టికెట్ అమ్ముతున్నారని ఎమ్మార్వోలంతా థియేటర్లను సీజ్ చేస్తుంటే అల్లు అర్జున్ స్పందిస్తే బాగుండేదన్నారు. ఇవన్నీ చేసుంటే మీరు ఇండస్ట్రీకి ఉన్నారు, పరిశ్రమ తరపున మాట్లాడారనే భావన ఉండేదని.. కానీ ఉన్నపళంగా నంద్యాల వెళ్లడం, ఆ వెంటనే ఎన్నికల ప్రచార గడువు ముగియడం డ్రామా కాదా అని నట్టికుమార్ నిలదీశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి దీనిపై బన్నీ ఫ్యాన్స్, అతని టీం ఏమైనా స్పందిస్తుందా అన్నది చూడాలి.


Click it and Unblock the Notifications











