‘బాహుబలి’ కాపీ ఆరోపణపై స్పందించిన రాజమౌళి టీం
హైదరాబాద్: ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా విడుదలైన 'బాహుబలి' చిత్రం మేకింగ్ వీడియో.....కామిక్ ఎపిక్ అనే హాలీవుడ్ ప్రోమోను పోలి ఉండటంతో దాన్ని మక్కికి మక్కి కాపీ కొట్టారని ప్రచారం జరిగిపోయింది. ఈ ప్రచారం వల్ల సినిమాపై నెగెటివ్ ప్రభావం పడే అవకాశం ఉండటంతో.....రాజమౌళి టీం స్పందించింది.
ఈ చిత్ర నిర్మాత శోబు యార్లగడ్డ కాపీ కొట్టారనే ఆరోపణలను ఖండించారు. 'మేము కమర్షియల్‌గా ఆ టెమ్‌ప్లేట్ కొనుగోలు చేసాం. లీగల్‌గా లైసెన్సు కలిగి ఉన్నాం. ఎవరైనా ఆ టెమ్‌ప్లేట్ కొనుగోలు చేయవచ్చు. మేము దాన్ని కొనుక్కున్నాం...కాపీ చేయలేదు. ఆ డిజైన్ ఆధారంగానే బాహుబలి మేకింగ్ వీడియో తయారు చేసాం' అని తెలిపారు. నిర్మాత్ వివరణ ఇవ్వడంతో ఈ వివాదానికి తెరపడినట్లయింది.
ఈ మేకింగ్ వీడియో వారం గడవక ముందే 1 మిలియన్(10 లక్షలు) హిట్స్ సొంతం చేసుకుంది. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న 'బాహుబలి' షూటింగ్ మూడో షెడ్యూల్ జరుగుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు రాణా, అనుష్క, రమ్యకృష్ణ ముఖ్య పాత్ర పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. సినిమా కోసం ఫిల్మ్ సిటీలో కోట్లాది రూపాయల ఖర్చుతో భారీ సెట్టింగులు వేసారు. అవార్డ్ విన్నింగ్ ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ వాస్తవికత ఉట్టిపడేలా ఈ సెట్ డిజైన్ చేసారు.
ఇంకా సత్యరాజ్, నాజర్, అడవి శేషు, సుదీప్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆర్కా మీడియా బేనర్‌పై శోభు యార్లగడ్డ, కె. రాఘవేంద్రరావు, దేవినేని ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళంలో షూట్ చేస్తున్నారు. హిందీ, విదేశీ బాషల్లోనూ విడుదల చేసే అవకాశం ఉంది.
భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈచిత్రం భారతీయ సినీ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే 'ఈగ' చిత్రంతో రాజమౌళి ఖ్యాతి అంతర్జాతీయంగా పాపులర్ అయింది. ఈ చిత్రం ఆయనకు మరింత పాపులారిటీ తెస్తుందని భావిస్తున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు 2015లో వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications












