నన్ను అనుమానించొద్దు, అంజలి అదృశ్యంపై సురేష్ కొండేటి
హైదరాబాద్ : సోమవారం అదృశ్యమైన హీరోయిన్ అంజలి తెలుగు నిర్మాత సురేష్ కొండేటికి టచ్‌లో ఉన్నట్లు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సురేష్ కొండేటి శుక్రవారం జరిగిన క్రేజీ మూవీ సక్సెస్ మీట్లో స్పందించారు. తనకు ఏమీ తెలియదని, అంజలి తన వద్ద ఉన్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు.
తాను అంజలితో మాట్లాడి నాలుగు రోజులైందని సురేష్ కొండేటి పేర్కొన్నారు. అంజలి ఎక్కడున్నా వెంటనే ఆమె బయటి ప్రపంచంలోకి రావాలని కోరారు. ఒకవేళ తనకు అంజలి జాడ తెలిస్తే మీడియాకు చెబుతానన్నారు. అంజలి నటించిన పలు తమిళ సినిమాలను సురేష్ కొండేటి తెలుగులో విడుదల చేసారు. ఈ నేపథ్యంలో ఆయను అంజలితో మంచి సాన్నిహిత్యం ఉంది.

అయితే తాను క్షేమంగా ఉన్నానని తన అన్నతో నటి నిన్న మాట్లాడిని విషయం తెలిసిందే. అయినా, ఆమె ఇప్పటి వరకు మీడియా ముందుకు రాకపోవడం సంచలనంగా మారింది. కాగా...అంజలిని రెండు వారాల్లోగా కోర్టులో హాజరు పరుచాలని మద్రాసు హైకోర్టు శుక్రవారం చెన్నై పోలీసులను ఆదేశించింది. అంజలి అపాయంలో ఉందని, ఆమెను రక్షించాలని ఆమె పిన్ని భారతీదేవి న్యాయస్థానాన్ని ఆశ్రయించిన నేపథ్యంలో కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.
అంజలి శుక్రవారం హైదరాబాద్ వచ్చిందని, మీడియా ముందుకు వస్తుందనే ఊహాగానాలు వెలువడినప్పటికీ....ఆమె ఆచూకీ ఇప్పటి వరకు తెలియరాలేదు. మరో వైపు ఆమెతో సినిమాలు కమిటైన నిర్మాతలు ఆందోళనలో పడ్డారు. ఆమె అందుబాటులో లేక పోవడంతో డి. సురేష్ బాబు, స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్న బోల్ బచ్చన్ షూటింగ్ నిలిచి పోయింది. ఈ చిత్రంలో అంజలి వెంకీకి జోడీగా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











