'చరణ్' తో సినిమాకు జంకుతున్నారు
'మగధీర' సినిమా హిట్ తో తన క్రేజ్ ను అమాంతం పెంచుకున్న రామ్ చరణ్ తో సినిమాలు చెయ్యడానికి నిర్మాతలు జంకుతున్నారు. దీనికి కారణం ఆ సినిమా భారీ వ్యయంతో రూపొందడమే. సుమారు 40 కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఈ చిత్రం రూపొందింది. సినిమా కూడా ఓ రేంజిలో హిట్ అయింది కనుక డబ్బులు కూడా అదే రేంజిలో రాబడుతోంది. కానీ ప్రస్తుతం చరణ్ స్టార్ డమ్ ఏమిటి? ఎలాంటి సినిమాలు తీయాలి? ఒక వేళ తియ్యాలనుకున్నా ఎంత డబ్బు డిమాండ్ చేస్తారు? సగటు నిర్మాతని వేధిస్తున్న ప్రశ్నలివి.
ఒక వేళ వీటన్నిటికీ సిద్ధపడి సినిమా చేద్దామన్నా ఎలాంటి సినిమా తీయాలి? సాదాసీదా సినిమా తీయడానికి వీల్లేదు. అత్యంత భారీ హిట్ ఇచ్చిన హీరోతో భారీ బడ్జెట్ సినిమాయే తీయాలి. కానీ అసలు చిక్కు అక్కడే వస్తుంది. 'మగధీర' లాంటి భారీ హిట్ తర్వాతి చిత్రం కూడా అదే రేంజిలో వుండాలని ప్రేక్షకులు ఆశిస్తారు. అంచనాలకు ఏ మాత్రం తక్కువైనా నిర్మొహమాటంగా తిరస్కరిస్తారు. అంత భారీగా పెట్టుబడి పెట్టిన సినిమా ఫ్లాప్ అయితే నిర్మాత గంగలో దూకాల్సిందే. అసలు 'మగధీర' సినిమాలో కూడా ఎన్నో లోపాలు వున్నా రాజమౌళి మానియా, చరణ్ నటనా ప్రతిభ ముందు కనిపించలేదు. కానీ ప్రేక్షకుడు తర్వాతి సినిమాను కూడా ఇదే విధంగా ఒప్పుకుంటాడా? అంటే సందేహమే. అసలు ప్రేక్షకుడి నాడిని తెలుసుకోవడం ఎవ్వరి తరమూ కాదు.
ఇన్ని సందేహాల మధ్య వున్న నిర్మాతలకు తగిన సమాధానం ఇవ్వడానికే చరణ్ తన మూడో చిత్రాన్ని పూర్తి స్థాయి ప్రేమకథగా రూపొందేందుకు భాస్కర్ చేతిలో పెట్టాడట. ఈ సినిమాను కూడా బయటి నిర్మాతలు కాకుండా తమ సొంత బ్యానర్ 'అంజనా ప్రొడక్షన్స్' మీదనే తీస్తున్నాడు. సో ఈ సినిమా తర్వాత చరణ్ తో ఎలాంటి చిత్రాలు చెయ్యవచ్చో నిర్మాతలు తెలుసుకోవచ్చన్నమాట.


Click it and Unblock the Notifications











