'రౌడీ' షోలు ఆపేయలంటున్నారు
హైదరాబాద్ : మోహన్‌బాబు - రామ్‌గోపాల్ వర్మ కలయికలో రూపొందిన చిత్రం 'రౌడీ' . ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుని కలెక్షన్స్ లేక ఇబ్బందిపడుతూంటే ఇప్పుడు మరో సమస్య ఎదురైంది. రౌడీ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని తెలంగాణ న్యాయవాదుల ఐకాస నేత బి.నర్సింహారెడ్డి ఈసీని కోరారు. ఈ మేరకు సచివాలయంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.
సికింద్రాబాద్ శాసనసభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీలో ఉన్న సినీనటి జయసుధ కూడా ఈ చిత్రంలో నటించటంతో దీన్ని నిలపివేయాలంటున్నారు. ఆయన మాట్లాడుతూ... జయసుధ నటించిన రౌడీ సినిమా ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పారు.

ఇక లెజండ్ కు కూడా ఇదే సమస్య ఎదురైన సంగతి తెలిసిందే. నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీనుల కాంబినేషన్ లో రూపొందిన "లెజెండ్'' చిత్రం మాస్ తో పాటు క్లాస్ ఫ్యామిలీ అడియెన్స్ ను కూడా ఆకట్టు కుంటూ ముందుకు దూసుకు పోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం షోలు ఆపేయండని అనంతపురం కలెక్టరకు వినతి పత్రం అందచేసారు. వైఎస్ ఆర్ సీపీ లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ నారాయణ రెడ్డి, కో ఆర్డినేటర్ ఆదినారాయణ కలెక్టర్ లోకేషన్ కుమార్ ని కలిసి వినతిపత్రం అందచేసారు.
ఆ సినిమా హీరో బాలకృష్ణను తెలుగుదేశం పార్టీ హిందూపురం అసెంబ్లీ అభ్యర్దిగా ప్రకటించిన నేపధ్యంలో ఓటర్లు ప్రభావితం అయ్యే ప్రమాదం ఉందని అన్నారు. అలాగే లెజండ్ సినిమా టీడీపి కి అనుకూలంగా ఉందని, అందులో డైలాగులు ఆ పార్టికి ప్రచారం చేకూర్చేలా ఉన్నాయని చెప్పారు. సీమాంధ్ర, తెలంగాణాలో ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఆ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని కోరారు.


Click it and Unblock the Notifications











