టాలీవుడ్లో మరో ‘సైకో’ వస్తున్నాడు
హైదరాబాద్: భగీరథ్, రేఖ హీరో హీరోయిన్లుగా కె. వర్మ దర్శకత్వంలో పి.సి.ఫిలింస్ పతాకంపై కె.కార్తీక్ నిర్మిస్తున్న 'సైకో' చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెలాఖరున విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను నిర్మాత కె. కార్తీక్ తెలియజేస్తూ...'ఇటీవలే ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. హైదరాబాద్, వైజాగ్, అరకు, పరిసర ప్రాంతాలలో చిత్ర నిర్మాణం జరిగిందని' తెలిపారు.
'ఎక్కడ రాజీ పడకుండా అనుకున్నది అనుకున్నట్లుగా దర్శకుడు వర్మ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. కథ విషయానికొస్తే ఓ నాలుగు జంటలు కలిసి విహార యాత్రకు ఓ అడవిలోకి వెళతారు. అక్కడ ఈ జంటలు అనుకోకుండా దారి తప్పి, ఒక్కరొక్కరు చనిపోతుంటారు. కానీ వీళ్లను ఎవరు చంపుతున్నారో తెలుసుకుని అతనిని పట్టుకున్నాడా? లేదా? అన్నది తెరపై చూడాల్సిందే' అని నిర్మాత తెలిపారు.

యాక్షన్, రొమాన్స్, సస్పెన్స్, గ్లామర్, థ్రిల్లర్ అన్ని కమర్షియల్ అంశాలతో దర్శకుడు అద్భుతంగా మలిచారు. ఇందులో నటించిన హీరో హీరోయిన్ లతో పాటు అందరూ మంచి పెర్ఫార్మెన్స్ కనబరిచారు. ఈ చిత్రాన్ని ఆగస్టు నెలాఖరున విడుదల చేస్తున్నాము' అన్నారు. భగీరథ్, రేఖ జంటగా నటించిన ఈ చిత్రంలో సూర్య, జీవా, ప్రసన్న కుమార్, బాలాజీ, జెన్ని, వేణుగోపాల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
ఈ చిత్రానికి పాటలు: యం.రాము, సంగీతం: ఉమాశంకర్, కెమెరా: యస్.కుమార్, ఎడిటర్: పి.వేణు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: జి. అన్సారీ, నిర్మాత: కె. కార్తీక్, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: కె. వర్మ.


Click it and Unblock the Notifications