చిరుకు హీరోగా మొదటి చాన్స్ ఇచ్చిన దర్శకుడి కష్టాలు.. సహాయం కోసం ఎదురుచూపులు
దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలి అనే నానుడి సినిమా ఇండస్ట్రీలో ఎంతో ఫేమస్. దీన్ని అర్థం చేసుకున్న వారు ఎంతోకొంత మూటగట్టుకుని వారి చివరి సమయంలో ఎలాంటి చింత లేకుండా గడిపేస్తారు. మరికొంత మంది అలాంటివన్నీ పట్టించుకోకుండా, డబ్బును కూడబెట్టుకోకుండా చివరకు కష్టాల పాలవుతారు. ఒకప్పటి కంటే ఇప్పుడు ఇచ్చే రెమ్యూనరేషన్‌లు కొన్ని వందల రెట్లు ఉంటుంది. పారితోషికం విషయంలో హీరోలు, దర్శకులు కోట్లలో అందుకుంటున్నారు. అప్పటి తరానికి ఇంత పెద్ద మొత్తంలో వచ్చేవీ కావు.. వచ్చినా భవిష్యత్తు కోసం దాచిపెట్టుకున్న వారు అతికొద్ది మంది మాత్రమే. అలా నాటి దర్శకుడు ప్రస్తుతం తన అవసానదశలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాడు. అతను మరెవరో కాదు.. మెగాస్టార్ తొలి అవకాశం ఇచ్చిన గూడపాటి రాజ్ కుమార్.

ఆర్థిక కష్టాలతో సతమతం..
మెగాస్టార్ చిరంజీవి తొలి చిత్రం 'పునాది రాళ్లు'. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన వ్యక్తి గూడపాటి రాజ్‌కుమార్. ప్రస్తుతం ఈయన వయస్సు 75 యేళ్లు. అయితే, ప్రస్తుతం ఈయన తీవ్రమైన ఆర్థిక కష్టాలతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.

వైద్య ఖర్చులకు కూడా..
గత రెండు నెలల క్రితం ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. రక్తపు విరేచనాలు, గుండెకు వేసిన రెండు స్టంట్‌లతో ఇబ్బంది పడతున్నారు. ఇపుడు ఆయన ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. వైద్య ఖర్చులకు కూడా స్తొమత లేక అల్లాడిపోతున్నారు.

ఒంటరైన దర్శకుడు
ఆయన కుమారుడు కొన్నేళ్ల క్రితమే అనారోగ్యంతో మృతి చెందాడు. అనంతరం కొన్ని రోజులకే ఆయన భార్య కూడా మరణించారు. అనారోగ్యంతో మంచానికే పరిమితమై వైద్యం కోసం సాయం అందిచేవారి కోసం ఎదురు చూస్తున్నారు.
Recommended Video

సొంతిల్లు కూడా లేని డైరెక్టర్
కాగా, గూడపాటి రాజ్‌కుమార్ దర్శకుడిగానే కాదు... సినిమా నిర్మాతగా, కథ, పాటల రచయితగానూ పని చేశారు. అయినప్పటికీ ఆయనకు ఇప్పటికీ హైదరాబాద్‌లో సొంతిల్లు కూడా లేదు. అద్దె ఇంట్లోనే ఆయన ఉంటున్నారు.


Click it and Unblock the Notifications











