'బిజినెస్‌మేన్'లో బూతులు నిజమే: పూరీ జగన్నాధ్
మహేష్ పాత్ర పరంగా కొన్ని బూతులను కూడా పెట్టాల్సి వచ్చింది. కానీ సెన్సార్ కట్ చేసిందనుకోండి అంటున్నారు దర్శకుడు పూరీ జగన్నాధ్. ఆయన తాజా చిత్రం 'బిజినెస్‌మేన్' ప్రమోషన్ లో భాగంగా కలిసిన మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే... మహేష్ మామూలుగా రెండు మూడు సినిమాల్లో మాట్లాడే డైలాగులన్నీ కలిపి ఈ ఒక్క చిత్రంలోనే మాట్లాడేశారు. జీవితంలో మోసానికి గురై, నలిగిపోయిన ఎవరికైనా ఇలాంటి డైలాగులే వస్తాయి. ఎక్కువ ఫిలాసఫీని చెప్పాం. లాజిక్‌లకు తావుండదు. స్వార్థం, కసి అనేవి అందరిలోనూ ఉండాలి. అప్పుడే పోటీతత్వం పెరుగుతుంది. ఇప్పటివరకు మనం నేర్చుకున్న అంశాలన్నిటినీ వదిలిపెడితే కానీ కొత్త ఆలోచనలు పుట్టుకురావు అన్నారు.
ఇక మహేష్ చెప్పిన డైలాగ్స్‌కి క్లాప్స్ కొడుతున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ డైలాగ్స్‌కి అద్భుతమైన రెస్పాన్స్. బాగా కష్టాలు పడి నలిగిపోవడం వల్లనో ఏమో ఇలాంటి డైలాగ్స్ రాయగలిగాను. నా పర్సనల్ ఫిలాసఫీ డైలాగుల్లో ప్రతిబింబిస్తుంది. సమాజానికి వ్యతిరేకంగా ఉన్నట్టు అనిపిస్తాయి కానీ, అందులో నిజం ఉంది. మనం ఏదైతే నేర్చుకొన్నామో, దాంట్లోనే బతుకుతాం. గౌతమబుద్ధుడు ఎవరి మాట విన్నాడని ఆయన గొప్పవారయ్యారు? ఇక్కడ ఎవరికి వాళ్లే గొప్ప. అందుకే... 'మనిషి మాట అస్సలే వినొద్దు...' అనే సంభాషణ రాసుకొన్నాను. జీవితంలో విఫలమయ్యాం, చుట్టూ ఉన్నవాళ్లు మోసం చేశారని తెలిస్తే... ఎవరైనా ఇలాంటి మాటలే రాస్తారు. ఇందులోని చాలా సన్నివేశాల్లో నా జీవితం ప్రతిబింబిస్తుంటుంది అని చెప్పారు.


Click it and Unblock the Notifications











