అదే మా రాంబాబు ఉద్యోగం:పూరీ జగన్నాధ్
హైదరాబాద్ :పూరీ జగన్నాధ్,పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'కెమెరామెన్ గంగతో రాంబాబు'. మీడియా నేపధ్యంలో వ్యంగ్య చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్తరం ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి డి.వి.వి.దానయ్య నిర్మాత. ఈ చిత్రం తాజా విశేషాలను మీడియాతో పంచుకున్నారు పూరీ జగన్నాధ్.
పూరీ జగన్నాధ్ మాట్లాడుతూ... "వేడి వేడి వార్తల్ని అందించడమే రాంబాబు ఉద్యోగం. విశేషం ఉందనిపిస్తే చాలు.. కాకులు దూరని కారడవిలోనైనా, చీమలు దూరని చిట్టడవిలోనైనా రాంబాబు ప్రత్యక్షం అయిపోతాడు. రాంబాబు వెనుక కెమెరాపర్సన్ గంగ కూడా ఉందండోయ్. వీరిద్దరూ కలిసి ఎంత హంగామా చేశారో తెలుసుకోవాలంటే 'కెమెరామెన్ గంగతో రాంబాబు' సినిమా చూడాల్సిందే" అంన్నారు.
అలాగే 'బద్రి' సినిమాతో నాకు లైఫ్ ఇచ్చిన పవన్‌కళ్యాణ్‌గారితో మరో సినిమా చేయాలని చాలా సార్లు ప్లాన్ చేశాం. కానీ ఎందుకో మా కాంబినేషన్ అలా అలా డిలే అయి ఇప్పటికి కుదిరింది. దర్శకునిగా నాకు 25వ చిత్రం. ఇది ఓ న్యూస్ రిపోర్టర్ కథ. పవన్‌కళ్యాణ్ నుంచి ప్రేక్షకులు, అభిమానులు ఆశించే అన్ని అంశాలూ ఉండే డిఫరెంట్ యాక్షన్ ఫిలిం ఇది' అంటూ పూరీ జగన్నాధ్ చెప్పారు.
ఇక నిర్మాత మాట్లాడుతూ...''రాంబాబుగా పవన్ హావభావాలు, నటన అభిమానులకు కావల్సినంత వినోదం పంచుతాయి. పూరి సంభాషణలు అదనపు ఆకర్షణ. ప్రస్తుత సమాజంలోని కొన్ని అంశాలు తెరపై కనిపిస్తాయి. మరో నాలుగు రోజుల పాటు హైదరాబాద్‌లోనే చిత్రీకరణ జరుపుతాము''అని తెలిపారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం, ఆలీ, ఎం.ఎస్.నారాయణ, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి తదితరులు నటించే ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











