'దేవుడు చేసిన మనుషులు' ఆలస్యానికి కారణం
హైదరాబాద్: పూరీ జగన్నాధ్, రవితేజ కాంబినేషన్ లో రూపొంది విడుదలకు సిద్దమవుతున్న చిత్రం 'దేవుడు చేసిన మనుషులు'. ఈ చిత్రాన్ని ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు దర్శకుడు పూరీజగన్నాథ్ తెలిపారు. ఆయన ఈ చిత్రం ఆలస్యానికి కారణం తెలుపుతూ...సినిమా మొత్తం రెడీ అయింది. విడుదల కోసం అంతా ఎదురుచూస్తున్నారు. ఇతర పెద్ద చిత్రాలు విడుదల కావడంతో థియేటర్లు లేకపోవడం వల్ల సినిమా ఆలస్యమైంది. నా పాత చిత్రాల తరహాలోనే ఉంటూ ఎంటర్‌టైన్‌మెంట్ పాళ్ళు ఎక్కువగా ఉంటాయి. స్క్రీన్‌ప్లే కొత్తగా ఉంటుంది అని చెప్పారు.
ఈ చిత్రం కాన్సెప్టు గురించి పూరీ జగన్నాధ్ తెలుపుతూ... పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయమవుతాయట. మరి ప్రేమ పుట్టుక కూడా అక్కడే జరుగుతుందా? ఎవరు ఎవరిని ప్రేమించాలో దేవుడే నిర్ణయిస్తాడా? ప్రేమ అనే కాదు... ఈ సృష్టిలోని సమస్త విషయాలకూ బీజం భగవంతుడే వేస్తాడు. దేవుడికి అదో ఆట. ఈసారి ఆయనకు మరో ఇద్దరు దొరికారు... ఏదో మాయ చేసి వారిద్దరి మధ్య ప్రేమ సృష్టించాడు. మరి ఆ జంట ప్రేమ ప్రయాణం ఎలా సాగిందో తెలుసుకోవాలంటే మా సినిమా చూడాలి అన్నారు.
రవితేజ మాట్లాడుతూ...'ఇందులో సెటిల్‌మెంట్లు చేసే పాత్ర నాది. రెండు గంటలపాటు నవ్వించే సినిమా. మంచి ఆడియోను రఘుకుంచె ఇచ్చాడు. ప్రకాష్‌రాజ్ పాత్ర అద్భుతంగా ఉంటుంది' అని అన్నారు. రఘుకుంచె మాట్లాడుతూ...'ఆడియోకు మంచి రేటింగ్ వచ్చింది. సినిమా విడుదలకు 40 రోజులు గ్యాప్ రావడం వల్ల కూడా మరింత ప్లస్ అయింది. నా కెరీయర్‌కు ఇది ప్రమోషన్‌గా ఉంటుంది' అని అన్నారు.
'దేవుడు చేసిన మనుషులు'లో రవితేజ, ఇలియానా జంటగా నటించారు. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మాత. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. చిత్రాన్ని ఈ నెల చివరి వారంలో విడుదల చేస్తారు. సమర్పణ: రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, సంగీతం: రఘు కుంచె, ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్ కె.నాయుడు, పాటలు: భాస్కరభట్ల, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, సహ నిర్మాత: భోగవల్లి బాపినీడు, సమర్పణ: రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్.


Click it and Unblock the Notifications











