చర్లపల్లి జైల్లో పూరి జగన్నాథ్
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ చర్లపల్లి జైల్లో ప్రవేశించారు. కొంపతీసి బిజినెస్ మేన్ సినిమాపై కేసు నేపథ్యంలో పూరి జైలు బాట పట్టాడని మాత్రం అనుకోవద్దే. పూరి ఈ జైలుకు రావడానికి వేరే కారణం ఉంది. గణతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని...జైలు అధికారులు ఖైదీలకు పూరితో గడిపే అవకాశం కల్పించారు. ఓ టీవీ ఛానల్ కార్యక్రమంలో భాగంగా పూరి తన కొడుకు ఆకాష్, కూతురుతో కలిసి జైలుకెళ్లి ఖైదీలను ఉత్సాహ పరిచారు.
'ఎవడు సినిమా తీస్తే అది 250 రోజులు ఆడుతుందో అతనే పూరి జగన్నాథ్' అంటూ పూరిపై తమ అభిమానాన్ని చాటుకున్నారు ఖైదీలు. సినిమా ముచ్చట్లు చెబుతూ.... ఖైదీల జీవిత విశేషాలను తెలుసుకుంటూ ఉత్సాహంగా గడిపారు పూరి. జైల్లో ఖైదీలు చేస్తున్న వివిధ పనులను, వ్యవసాయం సాగు పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పూరి మాట్లాడుతూ...ఇది జైలులా లేదని, చర్లపల్లి ఆశ్రమంలా ఉందని చెప్పుకొచ్చారు.
పూరి జగన్నాథ్ ఇటీవల రూపొందించిన 'బిజినెస్ మేన్' సినిమా భారీ విజయం సాధించి కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించి 81 సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రలోనే అతిపెద్ద కమర్షియల్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ రవితేజతో 'దేవుడు చేసిన మనుషులు', బిజినెస్ మేన్ 2, పవన్ కళ్యాణ్, జూ ఎన్టీఆర్, నాగచైతన్యలతో సినిమాలు చేసే ప్లానింగ్ లో ఉన్నాడు.


Click it and Unblock the Notifications











