మహేష్ బాబుతో మరో సినిమా ప్రకటించిన పూరి
హైదరాబాద్: మహేష్ బాబు, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన 'పోకిరి' చిత్రం అప్పట్లో ఎన్ని రికార్డులు బద్దలు కొట్టిందో తెలిసిందే. ఆ మధ్య వీరి కాంబినేషన్లో 'బిజినెస్ మ్యాన్' సినిమా విడుదలై మంచి ఓపెనింగ్స్ సాధించింది. వీరిద్దరూ ముచ్చటగా మూడో సారి కలిసి పని చేయబోతున్నారు. మహేష్ బాబుతో మరో సినిమా చేబోతున్నట్లు పూరి జగన్నాథ్ ప్రకటించారు.
ఇటీవల మీడియాకు ఎదురుపడ్డ పూరి, మహేష్ బాబుతో త్వరలో సినిమా చేయబోతున్నట్లు వెల్లడించారు. గతంలో 'బిజినెస్ మేన్' సినిమా తర్వాత వీరి కాంబినేషన్లో 'బిజినెస్ మేన్-2' చిత్రం రాబోతోందనే ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రాజెక్టు ఆచరణకు నోచుకోలేదు. అయితే తాజాగా పూరి జగన్నాథ్ మహేష్ బాబు కోసం కొత్త స్క్రిప్టును రెడీ చేస్తున్నారట.
ఏది ఏమైనా మహేష్ బాబు, పూరి జగన్నాథ్ కాంబినేషన్ అంటే క్రేజ్ ఏం రేంజిలో ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా స్టోరీ, స్క్రిప్టు రెడీ చేస్తున్నాడట పూరి జగన్నాథ్. ప్రస్తుతం పూరి జగన్నాథ్ తన స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కిన 'హార్ట్ ఎటాక్' చిత్రం విడుదల వ్యవహారాలతో బిజీగా ఉన్నారు.
నితిన్, ఆదా శర్మ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన 'హార్ట్ ఎటాక్' చిత్రం ఈ నెల 31న విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియో మంచి విజయం సాధించిన నేపథ్యంలో సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.


Click it and Unblock the Notifications












