PV Narasimha Rao Biopic: వెండితెరపై అపర చాణక్యుడి జీవితం.. లాయర్ నుంచి ప్రధాని వరకు..
మాజీ ప్రధాని, బహుభాషా కోవిదుడు, భారతీయులంతా గర్వించే రాజకీయ నేత పీవీ నరసింహారావు జీవితం ఆధారంగా సినిమాను రూపొందించేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. మాజీ ప్రధాని పీవీ శతదినోత్సవం సందర్భంగా టాలీవుడ్ నిర్మాత తాడివాక రమేష్ నాయుడు బయోపిక్ వివరాలను ప్రకటించారు. పీవీ బయోపిక్ వివరాల్లోకి వెళితే..

జాతీయ స్థాయి ఉత్తమ నటుడితో
ఎన్టీఆర్ ఫిల్మ్స్ పతాకంపై భారీ బడ్జెట్‌తో రూపొందే చిత్రంలో జాతీయస్థాయిలో ఉత్తమ నటుడిగా ప్రశంసలు అందుకొన్న నటుడు పీవీ నరసింహరావుగా నటించనున్నారు. ఈచిత్రానికి ప్రముఖ దర్శకుడు ధవళసత్యం డైరెక్టర్‌గా వ్యవహరించనున్నారు. పీవీ నరసింహారావు బయోపిక్‌ను తెలుగు, హిందీ భాషల్లో నిర్మించనున్నామని, ఇతర భాషల్లో కూడా ఈ సినిమాను నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాం తెలిపారు.

జూన్ 28, 2022న విడుదల
ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాం. ప్రీ ప్రొడక్షన్స్ వ్యవహారాలను పూర్తి చేసుకొని సెట్స్‌పైకి వెళ్లనున్నాం అని నిర్మాత రమేష్ నాయుడు తెలిపారు. ప్రస్తుతం శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమాను త్వరగా పూర్తి చేసి జూన్ 28, 2022 రోజున రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అని రమేష్ నాయుడు పేర్కొన్నారు.

పీవీ వ్యక్తిగత జీవితం గురించి....
పాములపర్తి వెంకట నరసింహారావు (పీవీ నరసింహరావు) 28 జూన్ 1921న జన్మించారు. లాయర్‌గా జీవితాన్ని ప్రారంభించిన ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1957 నుంచి 1977 వరకు ఎమ్మెల్యేగా మంథని అసెంబ్లీ స్థానానికి ప్రాతినిథ్యం వహించారు. 1971లో ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టారు. ఆ తర్వాత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ స్థాపించిన కాంగ్రెస్ పార్టీ (ఐ)లో చేరారు. 1972లో ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన హోంశాఖ,రక్షణ శాఖ, విదేశాంగ శాఖ మంత్రిగా ఇందిరా, రాజీవ్ ప్రభుత్వ హయాంలో పనిచేశారు.

దేశ ప్రధానిగా పగ్గాలు..
రాజీవ్ గాంధీ మరణాంతరం తొలి గాంధీయేతర కుటుంబ సభ్యుడిగా దేశ ప్రధానిగా బాధ్యతలను చేపట్టారు. ఆ సమయంలో ఎంపీగా పోటీ చేయకపోవడంతో నంద్యాల నుంచి ఎంపీగా పోటీ చేసి 5 లక్షల మెజారిటీ విజయం సాధించారు. అప్పట్లో భారతీయ ఎన్నికల చరిత్రలో అత్యధిక మెజార్టీ సాధించిన ఎంపీగా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు సంపాదించారు. 23 డిసెంబర్ 2004లో గుండెపోటుతో పీవీ నరసింహారావు మరణించారు.


Click it and Unblock the Notifications