పివి కథతో వీరగాథ
ప్రపంచీకరణను సమర్థంగా ఎదుర్కోలేని ప్రభుత్వ యంత్రాంగం అసమర్థత కారణంగా రైతులు పడుతున్న కడగండ్లు అన్నీ ఇన్నీ కావు. అయితే, రైతులకు ఈ కష్టాలు సైతం కొత్తవి కావు. గతంలో వారు ఎదుర్కొన్న కష్టాలకు స్పందించి మాజీ ప్రధాని స్వర్గీయ పి.వి. నరసింహారావు చాలా కాలం కిందటే ఒక కథ రాశారు. గొల్ల రామవ్వ కథ పేరుతో ప్రచురితమైన ఈ కథ ఆధారంగా తెలుగులో ఒక చిత్రం ప్రారంభం అయింది.
టంగుటూరి ప్రొడక్షన్స్ పతాకంపై పృథ్వీరాజ్, పి.అమరేశ్ కుమార్ నిర్మాణంలో అల్లాణి శ్రీధర్ దర్శకత్వంలో వీరగాథ చిత్రం షూటింగ్ ఇటీవల హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో లాంఛనంగా ప్రారంభం అయింది. తెలంగాణా సాయుధ పోరాటం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో కథానాయకుని పాత్రను ప్రముఖ నటుడు మాదాల రంగారావు కుమారుడు మాదాల రవి పోషిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ కవి డాక్టర్ సి. నారాయణ రెడ్డి క్లాప్ ఇవ్వగా, సూర్యారావు కెమెరా స్విచాన్ చేశారు. ప్రముఖ నిర్మాత డాక్టర్ డి. రామానాయుడు స్క్రిప్ట్ పూజ నిర్వహించి పి.వి. తనయుడు పి.వి. రాజేశ్వరరావుకు అందించారు.
ఈ చిత్రాన్ని పి.వి.కి అంకితం ఇస్తున్నట్టు నిర్మాతలు ఈ సందర్భంగా వెల్లడించారు. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్న ప్రజల కష్టాలను ఈ చిత్రం వివరిస్తుందని దర్శకుడు అల్లాణి శ్రీధర్ తెలిపారు. హీరో మాదాల రవి మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, స్వేచ్ఛ కోసం తెలంగాణా ప్రజలు సాగిస్తున్న పోరాటం ఈ చిత్రానికి స్ఫూర్తి అన్నారు.
వీరగాథకు సంగీతం భూపాల్, కెమెరా మధు మహంకాళి, ఆర్ట్ దాశి సుదర్శన్, ఎడిటింగ్ కె.రవీంద్రబాబు.


Click it and Unblock the Notifications