ఇది కదా క్రేజ్ అంటే.. ఇంటర్ పరీక్షా పత్రంలో ఎన్టీఆర్ ప్రశ్న.. ఎక్కడంటే?
టాలీవుడ్ లో ప్రస్తుతం ఎన్టీఆర్ హాట్ టాపిక్ గా మారి పోయారు. చివరిగా రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమాలో కొమురం భీం పాత్రలో నటించిన ఎన్టీఆర్ గురించి ఇప్పుడు అనేక మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడిన కోట శ్రీనివాసరావు ఎన్టీఆర్ నటన మీద ప్రశంసల వర్షం కురిపించగా ఇప్పుడు ఏకంగా తెలంగాణ ఇంటర్ బోర్డు పరీక్షల లోనే ఎన్టీఆర్ గురించి ఒక ప్రశ్న ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

ప్రశంసలు
అరవింద సమేత వీర రాఘవ సినిమా చేసిన తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమాకి ఓకే చెప్పారు. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటించారు. సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించడమే కాక ఇంకా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ నటన తో పాటు ఎన్టీఆర్ నటనకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.

అభిమానులు పసిగట్టి
అసలు విషయం ఏంటంటే తెలంగాణలో ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే తెలంగాణ ఇంటర్ మొదటి సంవత్సరం ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ లో RRR సినిమాలోని కొమురం భీం పాత్రలో నటించిన జూనియర్ ఎన్టీఆర్ గురించి ఒక ప్రశ్న అడిగారు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ అభిమానులు పసిగట్టి దానిని ఈ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు

మావాడి క్రేజ్ చూశారా
ఇంటర్ ప్రశ్నాపత్రంలో అడిగిన సమాచారం ఏమిటంటే RRR సినిమాలో కొమురం భీం పాత్రలో తన యాక్టింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఎన్టీఆర్ తో మీరు ఒక రిపోర్టర్ గా ఇంటర్వ్యూ చేసి ప్రశ్నలడిగి సమాధానాలు చెబుతూ ఒక వ్యాసం రాయమని కోరారు. ఇంకేముంది ఎన్టీఆర్ అభిమానులు మావాడి క్రేజ్ చూశారా అంటూ సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కలెక్షన్ల వర్షం
ఇక RRR సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటించగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించాడు. రామ్ చరణ్ సరసన అలియా భట్ నటించగా ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ నటించింది. ఈ సినిమా విడుదలై దాదాపు 50 రోజులు దగ్గర పడుతున్నా ఇంకా చాలా చోట్ల మంచి కలెక్షన్ల వర్షం కురుస్తోంది అంటే సినిమాకి ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

కొరటాలతో సినిమా
ఇక మరోపక్క ఈ సినిమా పూర్తి కావడంతో ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు ఇప్పటికే ఆయన తదుపరి చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన అయితే వచ్చేసింది. ఆయన కొరటాల శివ తో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాను కొరటాల శివ స్నేహితులు సుధాకర్ నిర్మించబోతున్నారు. అలాగే ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ కి సంబంధించిన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ కూడా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మొత్తం మీద ఎన్టీఆర్ గురించి ఇంటర్ ప్రశ్నపత్రంలో ప్రశ్న కనిపించడం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.


Click it and Unblock the Notifications











