కేరళలో తెలుగు సినిమా షూటింగుపై దాడి
కేరళ: తెలుగు సినిమా షూటింగ్ యూనిట్ సభ్యులపై కేరళలో దాడి జరిగింది. సందీప్ కిషన్, రెజీనా హీరో హీరోయిన్లు తెరకెక్కుతున్న 'రా రా కృష్ణయ్య' చిత్రం షూటింగ్ కేరళలోని అల్లెప్పీ సమీపంలోని తిరువల్లాలో ఓ దేవాలయంలో జరుగుతుండగా శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. దాడిచేసిన వ్యక్తులు లోకల్‌గా ఉండే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్ఎస్) మద్దతుదారులని తెలుస్తోంది.
ఈ విషయాన్ని సందీప్ కిషన్ తన మైక్రో బ్లాగింగ్ సైట్ ద్వారా వెల్లడించారు. కేరళ పత్రికల్లో కూడా ఈ దాడి విషయం ప్రచురితమైంది. 'అధికారుల నుంచి అనుమతి తీసుకుని మేము షూటింగ్ మొదలు పెట్టాం. కొందరు వ్యక్తులు అక్కడి వచ్చి గొడవ చేయడం ప్రారంభించారు. పర్మిషన్ ఉందని చెప్పినా వారు వినలేదు. మా దర్శకుడు మహేష్‌పై దాడి చేసారు. లోకల్ మేనేజర్ 57 ఏళ్ల కబీర్‌పై దాడి చేసారు. చివరకు మా దర్శకుడి దగ్గర నుంచి కొంత డబ్బు తీసుకుని వెళ్లి పోయారు' అని సందీప్ కిషన్ తెలిపారు.
దాడి చేసిన వ్యక్తులు మతపరమైన ఉద్దేశాలతోనే వచ్చినట్లు తెలుస్తోంది. హీరోయిన్ రెజీనా మాట్లాడుతూ...'దేవాలయంలో ఎవరూ ఎలాంటి తప్పు చేయలేదు. యూనిట్ సభ్యులంతా పాదరక్షలు బయటే విడిచి వచ్చాం. కానీ వారు వచ్చిన ఉద్దేశ్యం వేరు. కావాలనే దాడి చేసారు' అని వెల్లడించారు.
ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. దాడికి పాల్పడిన వ్యక్తులు ఎవరు అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. డబ్బుల కోసంమే వారు షూటింగులో గలాటా సృష్టించినట్లు స్పష్టం అవుతోంది. లోకల్ మళయాలీలను తెలుగు సినిమా షూటింగులో తీసుకోవడం కూడా ఈ దాడికి మరో కారణమని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications












