‘రచ్చ’ఆడియో విడుదల పూర్తి విశేషాలు
రామ్‌చరణ్ హీరోగా నటించిన 'రచ్చ' ఆడియో ఆవిష్కరణ ఆదివారం రాత్రి హైదరాబాద్ లో జరిగింది. నెక్లెస్ రోడ్డులో జరిగిన కార్యక్రమంలో చిరంజీవి ఆడియో విడుదల చేశారు. తొలి సీడీని వి.వి.వినాయక్ ఆవిష్కరించారు. చిరంజీవి స్వీకరించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ''అభిమానులకు పూర్తిస్థాయిలో వినోదాన్ని పంచే చిత్రమిది. ఇటీవలే ఈ సినిమాలోని పాటల్ని చూశాను. భవిష్యత్తు అంతా రచ్చ రచ్చే అనిపిస్తోంది. మణిశర్మ గీతాలు బాగున్నాయి. 'మగధీర'తో రీమిక్స్ సంప్రదాయానికి తెరతీశారు రాజమౌళి. అందులో బంగారు కోడిపెట్ట... ఎంతలా ప్రేక్షకుల్ని అలరించిందో, 'గ్యాంగ్ లీడర్'లోని వానావానా వెల్లువాయె... పాటని అంతగా ఆస్వాదిస్తారు. ఈ పాటలు చూసినప్పుడు చరణ్‌లో నన్ను నేను చూసుకొన్నాను. 'ఆరెంజ్'లో ప్రేక్షకులు ఏమేం మిస్ అయ్యారో.. అవన్నీ ఈ సినిమాలో దొరుకుతాయి''అన్నారు.
రామ్‌చరణ్ మాట్లాడుతూ ''సంపత్ ఎంతో ప్రతిభావంతమైన దర్శకుడు. తనలోని స్పష్టత నాకు చాలా నచ్చింది. తెరపై సినిమా చూస్తున్నట్టుగా కథ చెప్పాడు. అందుకే ఈ సినిమా ఒప్పుకొన్నా. మణిశర్మని మెలోడీ బ్రహ్మ అంటారు. ఈ సినిమాతో మాస్ బ్రహ్మ అనిపించుకొంటాడు. ఎముకలు విరిగిపోయేలా ఆయన పాటలకు డాన్స్ చేయాల్సి వచ్చింది. ఇప్పటిదాకా నాతో నటించిన హీరోయిన్స్ లో తమన్నా నాకు ఎంతో నచ్చింది. ఈ సినిమాకోసం ఎంతో కష్టపడింది''అన్నారు.
''చిరంజీవికి 'గ్యాంగ్‌లీడర్' తరహాలో చరణ్‌కి ఈ చిత్రం గుర్తింపును తెచ్చిపెడుతుంది''అన్నారు వినాయక్. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం మలయాళం భాషల్లో విడుదల చేస్తామన్నారు నిర్మాతలు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ తమన్నా, దర్శకుడు సంపత్ నంది, నిర్మాత ఆర్‌బీ చౌదరితో పాటు మంత్రి గంటా శ్రీనివాసరావు, నాగేంద్రబాబు, అల్లు అరవింద్, అల్లు అర్జున్, అశ్వనీదత్, దిల్‌రాజు, రాజమౌళి, వివి వినాయక్, వంశీ పైడిపల్లి, పరుచూరి వెంకటేశ్వరరావు, వాకాడ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











