ప్రముఖ రేడియో జాకీ అమీన్ సయానీ కన్నుమూత.. మృతికి కారణం ఏమిటంటే?
దశాబ్దాల కాలంగా రేడియో శ్రోతలను అద్బుతమైన వాక్చాతుర్యం, మధురమైన మాటలతో ఆకట్టుకొంటున్న రేడియో జాకీ, బినాకా గీత్ మాలా అమీన్ సయానీ ఇకలేరు. బుధవారం రాత్రి ఆయన గుండెపోటుతో తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. 80 దశకం కంటే ముందు నుంచి తన ప్రజంటేషన్‌తో హిందీ పాటలను వినిపిస్తూ.. ఆ పాటల వెనుక ఉన్న చరిత్రను తెలియజేస్తూ శ్రోతలను ఆలరించారు. ఐకానిక్ రేడియో జాకీ ఇకలేరనే వార్తతో సంగీత, రేడియో, వినోద ప్రపంచం తీవ్ర దిగ్బ్రాంతికి గురైంది. ఆయన గురించిన వివరాల్లోకి వెళితే..
అమీన్ సయానీ 1932 సంవత్సరం డిసెంబర్ 21వ తేదీన బ్రిటీష్ ఇండియాలోని బొంబాయిలో జన్మించారు. సింధియా స్కూల్, సెయింట్ జేవీయర్ కాలేజీలో చదువుకొన్నారు. 1951 నుంచి రేడియోలో అనౌన్సర్‌గా, రేడియో జాకీగా యాక్టివ్‌గా ఉన్నారు. ఆయన కెరీర్ ఆలిండియా రేడియో బొంబాయిలో మొదలైంది. అక్కడ ఆయన 10 ఏళ్లకుపైగా సేవలు అందించారు.

రేడియో సిలోన్‌లో బినాకా గీత్‌మాలాతో అత్యంత ప్రాచుర్యం పొందారు. ఆ తర్వాత బినాకా కాస్త సిబాకాగా మారిపోయింది. అనంతరం ఆయన ఆలిండియా రేడియో వివిధ భారతీలో 42 సంవత్సరాల పాటు పనిచేశారు. ఆయన ప్రజెంట్ చేసిన బినాకా గీత్ మాలా, సంగీత్ కే సితాం కీ మెహిఫిల్, మరాఠా దర్బార్ లాంటి కార్యక్రమాలను ఆయన కొనసాగించి మంచి పేరు సంపాదించుకొన్నారు.
బాలీవుడ్ సినిమాల్లోను అమీన్ సయానీ నటించారు. భూత్ బంగ్లా, తీన్ దేవియాన్, బాక్సర్, కాతిల్ అనే సినిమాల్లో నటించారు. ఈ సినిమాల్లో కూడా అనౌన్సర్ పాత్రలను పోషించడం విశేషంగా చెప్పుకోవాలి.

రేడియో, వినోద పరిశ్రమలో విశేష సేవలు అందించించినందుకు గాను కేంద్ర ప్రభుత్వం అమీన్ సయానికి పద్మశ్రీ అవార్డును అందించింది. ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి లివింగ్ లెజెండ్ అవార్డును అందుకొన్నారు. ఇలా ఎన్నో అవార్డులు రివార్డులను అందుకొన్నారు.


Click it and Unblock the Notifications











