సాయిపల్లవి మైండ్ పాడైంది..అరెస్ట్ చేస్తే మళ్లీ జోలికి రారు..బీజేపీ ఎమ్మెల్యే ఫైర్
విరాట పర్వం సినిమా ప్రమోషన్స్ లో అనుకోకుండా కశ్మీర్ ఫైల్స్‌పై నటి సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దూమారం రేగుతోన్న సంగతి తెలిసిందే. ఆమె చేసిన కామెంట్స్ విషయంలో భజరంగ్‌దల్ నేతలు ఆమెపై మండిపడుతూ.. హైదరాబాద్‌లోని సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా పెట్టారు. ఇప్పుడు ఆమె మీద వరుసగా బీజీపీ నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికే విజయశాంతి ఆమెను విమర్శించగా ఇప్పుడు రాజా సింగ్ విమర్శించారు. ఆ వివరాల్లోకి వెళితే

కాశ్మీర్ ఫైల్స్ వివాదం
విరాట పర్వం మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి మాట్లాడుతూ.. 'కొన్ని రోజుల క్రితం వచ్చిన కశ్మీర్ ఫైల్స్ అనే సినిమాలో కశ్మీర్ పండిట్లను ఎలా చంపారో చూపించారని, ఇప్పుడు మనం వాటిని మత సంఘర్షణలా వాటిని చూస్తే.. రీసెంట్‌గా బళ్ళలో ఆవులని తీసుకెళ్తున్నారు.. బండిలో డ్రైవర్ ముస్లింగా ఉన్నాడని కొంత మంది కొట్టేసి.. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనమంటున్నరు. అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు జరిగిన దానికి తేడా ఎక్కడ ఉంది అని ప్రశ్నించింది.

మంచి ఉద్దేశంతోనే
మతాలు కాదు మనం మంచి వ్యక్తిగా ఉంటే.. ఇతరులను బాధించం.. లెఫ్టిస్ట్ అయినా రైటిస్ట్ అయినా మనం మంచిగా ఉండకపోతే న్యాయం ఎక్కడా ఉండదు..' అని అంటూ ఆమె కామెంట్ చేసింది. ఆమె మంచి ఉద్దేశంతోనే ఈ వ్యాఖ్యలు చేసినా అవి చినికిచినికి గాలివానలా మారి తీవ్ర దూమారం రేపుతున్నాయి. ఇక ఈ వివాదంపై త్వరలో స్పందిస్తానని సాయి పల్లవి ఇప్పటికే చెప్పింది. తాను ఇప్పుడు ఏది మాట్లాడినా.. 'విరాట పర్వం' మూవీ ప్రమోషన్స్ కోసం మాట్లాడుతున్నానని అంటారని.. తరువాత కూడా ఆమె సవివరంగా క్లారిటీ ఇచ్చింది.

సరికాదని హితవు
ఇప్పటికే ఈ విషయం మీద విజయ శాంతి స్పందించగా ఇప్పుడు.. సాయి పల్లవిపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేవిధంగా మాట్లాడిన సాయి పల్లవి వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని రాజా సింగ్ డిమాండ్ చేశారు. కమ్యూనిస్ట్ పుస్తకాలు చదివి సాయి పల్లవి మైండ్ పాడైందని.. వాస్తవాలు మాట్లాడే దమ్ము ఆమెకు లేదన్న ఆయన ఇలా మాట్లాడడం సరికాదని హితవు పలికారు.

సహించేదిలేదు
ఇలా ఏది పడితే అది మాట్లాడితే సహించేదిలేదని.. ప్రజలు తిరగబడి కొరతారని సాయి పల్లవిని హెచ్చరించారు. తెలంగాణతో పాటు ఏపీలోని అన్ని పోలీస్ స్టేషన్‌లో సాయి పల్లవిపై ఫిర్యాదు చేయండి. ఒకరిని అరెస్ట్ చేస్తే.. ఇక ఎవరూ హిందువుల జోలికి రాకుండా ఉంటారని ఆయన పిలుపునిచ్చారు. కొందరు పాపులర్ కావాలని ఇలా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.

బహిరంగ క్షమాపణలు చెప్పాలి
సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని, హిందువులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇస్లాం పైనా.. క్రిస్టియన్స్‌పైనా ఇలా కామెంట్ చేయగలరా..?' అని రాజా సింగ్ ప్రశించారు. హిందువులు ఏం చేయరని కామెంట్స్ చేస్తే.. దాడులు తప్పవని హెచ్చరించారు. మరి సాయి పల్లవి ఈ విషయం మీద ఎలా స్పందిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











