వాళ్లిద్దరూ బ్రహ్మచారులు కదా, ఇద్దరు హీరోయిన్లు ఏంటి.. రాజమౌళి సమాధానం ఇదే!
జక్కన్న రాజమౌళి తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంతో ఆర్ఆర్ఆర్ చిత్రంపై ఉన్న సందేహాలన్నింటినీ తొలగించారు. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు 1920 కాలం నాటి నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుందని తెలిపారు. స్వాతంత్ర ఉద్యమ వీరులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు జీవితంలో ఎవరికీ తెలియని అంశాలని కల్పిత గాధ రూపంలో చూపించబోతున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ కొమరం భీమ్ గా, రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. మీడియా సమావేశంలో పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు రాజమౌళి ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు.

బ్రహ్మచారులు కదా
కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు ఇద్దరూ బ్రహ్మచారులు. మీరేమో ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేయిస్తున్నారు.. ఎలా అని ప్రశ్నించగా రాజమౌళి ఆసక్తికర సమాధానం ఇచ్చారు. చరిత్రపై అనేక అభిప్రాయాలు ఉంటాయి. కొమరం భీమ్ కు ఇద్దరు భార్యలు అని కూడా చరిత్రలో ఉన్నట్లు రాజమౌళి తెలిపారు. ఇక అల్లూరి సీతారామరాజుకి తన మరదలు సీతతో చిన్ననాటి నుంచే రొమాన్స్ ఉందని, కానీ పెళ్లి చేసుకోలేదని రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. అందుకే తాను తెలిసిన కథ చెప్పడం లేదు అని, తెలియని కథని చెబుతున్నానని రాజమౌళి అన్నారు.

రాజమౌళి కాకపోతే ఒప్పుకునేవారా
సాధారణంగా ఎన్టీఆర్, రాంచరణ్ లకు కథ చెప్పి ఒప్పించడం కష్టం. అలాంటి మీరిద్దరూ కలసి నటిస్తున్నారు. ఒకవేళ రాజమౌళి కాకుండా వేరే దర్శకుడు అయితే కలసి నటించేందుకు అంగీకరిస్తారా అనే ప్రశ్నకు ఎన్టీఆర్ సమాధానం ఇచ్చాడు. వేరే దర్శకుడు అయితే కలసి నటిస్తారా అనేది భవిష్యత్తుకు సంబంధించిన ప్రశ్న. దానికి నేను సమాధానం చెప్పలేను. కానీ ఈ చిత్రానికి మాత్రం జక్కన్న వల్లే కలసి నటిస్తున్నట్లు ఎన్టీఆర్ తెలిపాడు. నాకు, చరణ్ మధ్య స్నేహం ఉంది. మా దిద్దరికి రాజమౌళిపై అపారమైన నమ్మకం అని ఎన్టీఆర్ తెలిపాడు.
ఆర్ఆర్ఆర్ ప్రెస్‌మీట్‌లో రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్

తెలుగు వీరులు
బాహుబలితో మీకు ఇండియా మొత్తం క్రేజ్ వచ్చింది. అయినా కూడా తెలుగు హీరోలతోనే మళ్ళీ సినిమా చేయడానికి కారణం ఏంటి అనే ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇస్తూ.. ఇది ఇద్దరు తెలుగు వీరులకు సంబంధించిన కథ. తెలుగు వారైతేనే న్యాయం జరుగుతుంది అని రాజమౌళి తెలిపాడు. బాహుబలి తర్వాత ఈ చిత్రంపై ఎన్ని అంచనాలు ఉంటాయో నాకు తెలుసు. కానీ వాటిని పట్టించుకోకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు రాజమౌళి తెలిపారు.
వివాదాల గురించి
ఇద్దరు స్వాతంత్ర సమరయోధుల కథని కల్పితంగా చెప్పబోతున్నారు.. వివాదాలు రావా అనే ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇస్తూ.. ఎలాంటి సినిమా చేసినా వివాదాలు వస్తాయని రాజమౌళి తెలిపారు. అసలు ఎలాంటి సంబంధం లేని బాహుబలి విషయంలో కూడా వివాదాలు సృష్టించారు. వివాదాలని పట్టించుకోను అని రాజమౌళి తెలిపారు.


Click it and Unblock the Notifications











