అరగంటకే హీరో చనిపోతాడు:రాజమౌళి
సినిమా మొదలైన అరగంటకే హీరో చనిపోతాడు. అయితే అతను ఈగ రూపంలో విలన్‌పై ఎలా పగ సాధించాడు అనేది సస్పెన్స్ అన్నారు ప్రముఖ దర్శకుడు రాజమౌళి. ఆయన తాజా చిత్రం'ఈగ'త్వరలో విడుదల కానున్న సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. ఎస్.ఎస్.రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'ఈగ'. తుది మెరుగులు దిద్దుకుంటోంది. త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. నాని, సమంత, సుదీప్ కీలక పాత్రధారులు. వారాహి చలనచిత్రం పతాకంపై తెరకెక్కుతోంది.
అలాగే రాజమౌళి మాట్లాడుతూ "బలవంతుడైన విలన్, బలహీనమైన ప్రాణి చేతిలో ఎలా ఓడిపోయాడు? ఎలా ప్రాణాలు కోల్పోయాడు? అనే అంశం చుట్టూ తిరిగే కథే 'ఈగ'. సంక్షిప్తమైన ఈ కథను నాని, సమంత, సుదీప్ అర్థం చేసుకుని చక్కగా నటించారు. చక్కటి ప్రేమ సన్నివేశాలు ఈ చిత్రంలో ఉంటాయి'' అని అన్నారు.'ఓ దుర్మార్గుడితో 'ఈగ' చేసిన పోరాటం ఈ కథ. అలాగని ఈగని ఆకాశమంత పెద్దదిగా చూపించడం లేదు. దానికేం అద్భుత శక్తుల్ని ఆపాదించడం లేదు. సాధారణ పరిమాణంలోనే ఉంటుంది. అయినా పోరాడుతుంది. విజువల్ ఎఫెక్ట్స్‌కి పెద్దపీట వేశాం. తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదల చేస్తామని అన్నారు.
ఇక ఈగ చిత్రాన్ని చిత్రం కథ గురించి ఆయన మీడియా తో మాట్లాడుతూ...చీమ - ఏనుగూ మధ్య గొడవ జరిగితే ఎవరు గెలుస్తారు? దోమతో సింహం ఫైటింగుకి దిగితే ఏం జరుగుతుంది? రెండు ప్రశ్నలకూ ఒకటే సమాధానం. అల్పప్రాణులపై బలవంతులదే రాజ్యం. అయితే ఈ అహంకారం, అతి విశ్వాసం అప్పుడప్పుడూ చేటు తీసుకొస్తుంది. ఆ కథ తాబేలు, కుందేలూ పరుగుపందెంలా ఉంటుంది. ఇక్కడ కూడా ఓ 'ఈగ' మనిషిపై పోటీకి దిగింది. మరి గెలిచిందా? లేదా? ఈ విషయాలు తెలుసుకోవాలంటే 'ఈగ' సినిమా చూడాల్సిందే అన్నారు.
ఇక ఈ చిత్రం విజువల్ ఎఫెక్ట్స్ అద్బుతంగా వస్తున్నాయని వినపడుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం దాదాపు ఐదు కోట్ల రూపాయలు ఇప్పటివరకూ గ్రాఫిక్స్ కోసం ఖర్చుపెట్టారని విశ్వసనీయ సమాచారం. మొత్తం బడ్జెట్ ముప్పై రెండు కోట్ల వరకూ అయిందని చెప్తున్నారు. తెలుగులో గ్రాఫిక్స్ పై ఇంత ఖర్చు ఎవరూ పెట్టలేదని చూసేవారికి విజువల్ ట్రీట్ లా ఉండాలని రాజమౌళి ఖర్చుకు వెనకాడకుండా చేస్తున్నాడని చెప్తున్నారు. సురేష్ ప్రోడక్షన్ సమర్పణలో ఈ చిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. సంగీతం: ఎం.ఎం.కీరవాణి, ఛాయాగ్రహణం: సెంథిల్‌కుమార్, సమర్పణ: డి.సురేష్‌బాబు.


Click it and Unblock the Notifications











