ఎన్.ఆర్.ఐలకు రాజమౌళి అపాలజీ...!
హైదరాబాద్: దర్శకుడు రాజమౌళి ఇటీవల పైరసీ దారులపై, పైరసీ వెర్షన్లు డౌన్ లోడ్ చేసుకుంటున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వార్నింగ్ ఇస్తూ ఓ వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే రాజమౌళి పొగరుగా ఎన్.ఆర్.ఐలకు వార్నింగ్ ఇచ్చినట్లు కామెంట్స్ వచ్చాయి. దీనిపై రాజమౌళి ఈ రోజు స్పందిస్తూ నా మాటలు అలా ధ్వనించి ఉంటే అపాలజీ ఇస్తున్నాను. నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను కేవలం తీవ్రమైన, తరచూ పైరసీకి పాల్పడే వారిపై మాత్రమే కోపం చేస్తూ వార్నింగ్ ఇచ్చాను అని చెప్పుకొచ్చారు.
పైరసీ మూలంగా ఈగ చిత్రానికి భారీ నష్టం వాటిల్లుతోందని, ఇప్పటి వరకు 6,55,000 మంది ఈగ పైరసీ వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారని, దీని వల్ల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని రాజమౌళి చెప్పుకొచ్చారు. గత వారం బీటెక్ స్టూడెంట్స్, సాఫ్ట్ వేర్ ఇంజనీర్స్ ఈగ పైరసీ వెర్షన్‌ను టోరెంట్‌లో పోస్టు చేసి, సినిమా పైరసీని స్ప్రెడ్ చేస్తూ అరెస్టయ్యారని రాజమౌళి గుర్తు చేశారు.
ఈగ చిత్రమే కాదు..ఏ సినిమా పైరసీ చేసినా, పైరసీ వెర్షన్ ఇంటర్నెట్ నుంచి డౌన్ లోడ్ చేసుకున్నానేరమే. ఏపి ఫిల్మ్ ఛాంబర్, యాంటీ పైరసీ సెల్ సంయుక్తంగా సీరియస్‌గా ముందుకు సాగుతున్నారు. పైరసీని ప్రొత్సహించి చిక్కుల్లో పడవద్దు అని రాజమౌళి కోరారు.
వారాహి చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి ఈగ చిత్రాన్ని నిర్మించారు. సురేష్ బాబు సమర్పణలో ఈ నెల 6న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌తో ముందుకు సాగుతోంది. ఈ చిత్రం తర్వాత రాజమౌళి ప్రభాస్‌తో సినిమా చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











