ప్రేమ కోసం పోరాటం ('ఈగ' ప్రివ్యూ)
రిలీజ్ డేట్స్ మార్చుకుంటూ ప్రేక్షకులలో ఉత్కంఠను రేపుతూ వస్తున్న 'ఈగ' ఎట్టకేలకు ధియోటర్లో ఈ రోజు దిగటానికి ముహూర్తం పెట్టుకుంది. అపజయమెరగని దర్శకుడు కావటంతో రాజమౌళి చిత్రమంటేనే సాధారణంగా విపరీతంగా క్రేజ్ ఉంటుంది. అలాంటిది ఈగ ను హీరోగా పెట్టి గ్రాపిక్స్ ప్రధాన పాత్రలో పూర్తి సినిమా చెయ్యటంతో అన్ని వర్గాల్లో ఆసక్తి నెలకొనింది. ముఖ్యంగా కథను ముందే రివిల్ చేసేయటంతో అందరూ తమకు తెలిసిన కథను తెరపై ఎలా చూపించాడా అని ఎదురుచూస్తున్నారు.
నాని (నాని) సరదా కుర్రాడు. తొలి చూపులోనే ఇందు (సమంత)ని ప్రేమిస్తాడు. మరో వైపు సుదీప్ (సుదీప్) కూడా ఇందుపై మనసుపడతాడు. ఎలాగైనా సరే... దక్కించుకోవాలనుకొంటాడు. తనకు తెలిసిన సామదానబేధదండోపాయాలను ప్రయోగిస్తాడు. వీటన్నింటికీ అడ్డుగా నిలుస్తున్నాడని నానిని హత్య చేస్తాడు. నాని ఆత్మ ఓ ఈగలోకి ప్రవేశిస్తుంది. సుదీప్ బారి నుంచి ఇందుని ఈగ కాపాడగలిగిందా? ఆ చిరు జీవి చేసిన పోరాటం ఫలించిందా? ఈ విషయాలన్నీ తెరపై చూసి తెలుసుకోవలసిందే.
రాజమౌళి మాట్లాడుతూ... 'ఓ దుర్మార్గుడితో 'ఈగ' చేసిన పోరాటం ఈ కథ. అలాగని ఈగని ఆకాశమంత పెద్దదిగా చూపించడం లేదు. దానికేం అద్భుత శక్తుల్ని ఆపాదించడం లేదు. సాధారణ పరిమాణంలోనే ఉంటుంది. అయినా పోరాడుతుంది. విజువల్ ఎఫెక్ట్స్‌కి పెద్దపీట వేశాం అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ ''ఈగ ఏం చేయగలదో, ఏం చేయలేదో ఇవన్నీ తెరపై చూపించాం. బలవంతుడైన ప్రతినాయకుడికీ, అల్ప జీవికీ మధ్య సాగే పోరు ఉత్కంఠ రేకెత్తిస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్, కీరవాణి సంగీతం ప్రధాన ఆకర్షణలు''అన్నారు.
సంస్థ: వారాహి చలనచిత్రం
నటీనటులు: నాని, సమంత, సుదీప్, ఆదిత్య మీనన్, దేవదర్శిని, నోయల్, హంసానందిని తదితరులు.
ఛాయాగ్రహణం: సెంథిల్‌కుమార్
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
సమర్పణ: డి.సురేష్ బాబు
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాత: సాయి కొర్రపాటి
దర్శకత్వం: ఎస్.ఎస్.రాజమౌళి
విడుదల: శుక్రవారం.
సమర్పణ: డి.సురేష్ బాబు.


Click it and Unblock the Notifications











