దానికి రాజమౌళి తండ్రే ముగింపు ఇస్తాడట!
హైదరాబాద్: ఆ మధ్య నాగార్జునతో 'రాజన్న' చిత్రం రూపొందించిన రాజమౌళి ఫాదర్ విజయేంద్ర వర్మ ఈ సారి కన్నడ పరిశ్రమపై కన్నేశాడు. రచయిత, దర్శకుడు అయిన విజయేంద్రవర్మ గతంలో పలు కన్నడ సినిమాలకు స్క్రిప్టు అందించారు. కొన్ని రోజులక్రితం మరణించిన కన్నడ హీరో విష్ణు విష్ణువర్ధన్ హిట్ మూవీ 'అప్పాజీ' చిత్రానికి కూడా ఆయన స్క్రిప్టు సమకూర్చారు. తాజాగా ఆయన కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర నటించనున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుతో సాండల్‌వుడ్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
గతంలో ఉపేంద్ర, విష్ణువర్ధన్ కలిసి 'యుగె యుగె' చిత్రంలో నటించాలని నిర్ణయించుకున్నారు. ఈ ఇద్దరు హీరోల డ్రీమ్ ప్రాజెక్టు అయిన ఈచిత్రం కోసం 16 మంది రైటర్లు పని చేసారు. అయితే క్లైమాక్స్ విషయంలో రచయితల మధ్య విబేధాలు రావడంతో ప్రాజెక్టు ఆగి పోయింది. హీరో విష్ణువర్ధన్ మరణంతో ఈ ప్రాజెక్టు పూర్తిగా మూలన పడ్డట్లయింది.
తాజాగా ఈచిత్ర నిర్మాతలు దాని స్క్రిప్టు పూర్తి చేసి ఉపేంద్ర హీరోగా తెరకెక్కించాలని చూస్తున్నారు. క్లైమాక్స్ పార్టును పూర్తి చేయాలని విజయేంద్రవర్మను నిర్మాతలు సంప్రదించగా ఆయన ఓకే చెప్పారు. త్వరలోనే విజయేంద్రవర్మ 'యూగె యూగె' కథకు ముగింపు ఇవ్వబోతున్నారు.
మంచి రచయితగా పేరున్న విజయేంద్ర వర్మ ఈ చిత్రానికి పర్ ఫెక్ట్ క్లైమాక్స్ తో ముగింపు ఇస్తారని భావిస్తున్నారు. ఉపేంద్ర హీరోగా నటించనున్న ఈచిత్రంలో విష్ణువర్ధన్ స్థానంలో మరో హీరో శివరాజ్ కుమార్‌ను తీసుకునే ఆలోచనలో ఉన్నారు. రాక్ లైన్ వెంకటేష్ ఈచిత్రాన్ని నిర్మించబోతున్నారు.


Click it and Unblock the Notifications











