జపాన్‌లో బాహుబలి-2 ప్రభంజనం: ఉప్పొంగిపోతూ రాజమౌళి ట్వీట్
Recommended Video

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'బాహుబలి-2' చిత్రం జపాన్‌లో కూడా సంచలన విజయం సాధించింది. డిసెంబర్ 29, 2017లో జపనీస్ బాషలో ఈ చిత్రాన్ని విడుదల చేయగా విజయవంతంగా అక్కడ 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా జపనీస్ బాహుబలి-2 డిస్ట్రిబ్యూటర్లు భారీ వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో దర్శకుడు రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డ హాజరయ్యారు. దీనికి జపాన్ ఫ్యాన్స్ భారీగా తరలి రావడం, వారి నుండి వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్ చూసి రాజమౌళి ఫిదా అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్లో ఓ వీడియో పోస్టు చేశారు.
హ్యాపీ డే అంటూ రాజమౌళి ట్వీట్
‘‘బాహుబలి 2' ఇంత పెద్ద విజయం సాధించడానికి కారణమైన అభిమానుల్ని, సినీ ఔత్సాహికులను నిన్న రాత్రి జపాన్ రాజధాని టోక్యోలో కలవడం చాలా సంతోషంగా ఉంది. సినిమాపై ప్రేమ హద్దులను చెరిపేసింది. హ్యాపీ డే'' అంటూ రాజమౌళి ట్వీట్ చేశారు.

తెలుగులో ప్లకార్డులు
టోక్యోలో జరిగిన 100 రోజుల వేడుకలో పలువురు జపాన్ అభిమానులు దర్శకుడు రాజమౌళి, శోభు యార్లగడ్డకు ధన్యవాదములు తెలుపుతూ తెలుగులో ప్లకార్డులు ప్రదర్శించడం విశేషం.

జపాన్ అభిమానులతో రాజమౌళి
జపాన్‌లో జరిగిన బాహుబలి-2 వంద రోజుల వేడుకకు ఫ్యాన్స్ కొందరు బాహుబలి మూవీ పాత్రల వేషధారణలో హాజరయ్యారు. ఈ సందర్భంగా వారితో రాజమౌళి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

త్వరలో 2 వేల కోట్లు క్లబ్‌లో!
బాహుబలి మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.1700 కోట్లకుపైగా గ్రాస్ వసూలు చేసింది. త్వరలో ఈ చిత్రం చైనాలోనూ విడుదల కాబోతోంది. చైనా విడుదల తర్వాత ఈ మూవీ ఓవరాల్ వసూళ్ల రూ. 2000 కోట్లను అందుకుంటుందని అంచనా.


Click it and Unblock the Notifications











