రాజమౌళి, ఎన్టీఆర్ యమగోల
ఇంకా అధికారికంగా ప్రకటనేదీ వెలువడనే లేదు.. అప్పుడే ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్‌లో రాబోయే చిత్రం గురించి కథనాలు చిలవలుపలవలుగా విస్తరిస్తున్నాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి విజయాల తర్వాత మళ్లీ ఈ చిత్రం రూపుదిద్దుకుంటున్నందు వల్ల సహజంగానే చిత్రపరిశ్రమలో ఇదొక క్రేజీ ప్రాజెక్టుగా సిద్ధమవుతోంది. ఇప్పటివరకూ వచ్చిన వార్తలు బట్టి.. ఈ చిత్రాన్ని విశ్వామిత్ర క్రియేషన్స్ పతాకంపై దర్శకుడు రాజమౌళి కుటుంబ సభ్యులు సినిమా నిర్మిస్తున్నారు. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథ సిద్ధం చేస్తున్నారు. కీరవాణి సంగీతం, సెంథిల్ ఫోటోగ్రఫీ, ఆనంద్ సాయి ఆర్ట్, ఎడిటింగ్ కోటగిరి వెంకటేశ్వరరావు.
ఈ కథ గతంలో పెద్ద ఎన్టీఆర్ నటించిన యమగోలకు దగ్గరగా ఉంటుందని, సినిమా టైటిల్ కూడా యమదొంగ అని నిర్ణయించారని, యముడిగా మోహన్‌బాబు నటిస్తారని, ఇందులో అయిదుగురు హీరోయిన్లని.. స్వర్గంలో జూనియర్ ఎన్టీఆర్ తన తాతగారైన ఎన్టీఆర్‌ని కలుస్తారని, అలాగే నటి సౌందర్యను కూడా కలుస్తారని.. ఇవన్నీ గ్రాఫిక్స్ ద్వారా చిత్రీకరించాలని ప్లాన్ చేశారని.. ఇలా అనేక కథనాలు ప్రచారంలోకి వచ్చాయి.
ఈ విషయాలనే దర్శకుడు రాజమౌళి వద్ద ప్రస్తావించగా.. ఆయన వేటినీ ఖండించలేదు. ఇలాంటివి చాలా ఆలోచించామని, అయితే కథ ఏది ఫైనల్ చేశామన్నది త్వరలోనే వెల్లడిస్తామని చెప్పి వూరుకున్నారు. ఎన్టీఆర్ హీరోగా డిసెంబర్‌లో సినిమా మాత్రం ప్రారంభిస్తామని రాజమౌళి స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications











