ఎప్పటిలాగే రాజమౌళి ఖండించాడు
హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు రాజమౌళికి చెందిన ఏదో ఒక వార్త రావటం, తర్వాత అదంతా రూమర్...అలాంటిదేమీ లేదని ఖండించటం రెగ్యులర్ ఈ మధ్యకాలంలో జరుగుతోంది. ముఖ్యంగా ఆయన తదుపరి ప్రాజెక్టు గురించే ఈ రూమర్స్ మొదలవుతున్నాయి. తాజాగా ఆయన కన్నడలో పాఠకాదరణ పొందిన 'పర్వ' అనే నవల ఆధారరగా రాజమౌళి చిత్రాన్ని తెరకెక్కించే అవకాశాలున్నాయని వార్తలు వచ్చాయి. ఈ నవలను ఎస్.ఎల్.భైరప్ప రచించారు. మహాభారత యుద్ధాన్ని మరో కోణంలో ఆవిష్కరించిన రచన ఇది. ప్రస్తుతం 'పర్వ' నవల హక్కుల కోసం రాజమౌళి ప్రయత్నిస్తున్నట్టు మీడియాలో మారు మోగింది. అయితే వాటిని ఇమ్మిడియట్ గా రాజమౌళి తన ట్వీట్ తో ఖండించారు.
రాజమౌళి ట్వీట్ చేస్తూ... నేను కన్నడ నవల ఆధారంగా సినిమా చేస్తున్నట్లు వచ్చిన వార్తలో నిజం లేదు. బాహుబలి తర్వాత తర్వాత ఏం చేయాలనేది ఇప్పటి వరకూ నా దగ్గర ఏ ప్లానూ లేదు అన్నారు. రాజమౌళి ప్రస్తుతం భారీగా 'బాహుబలి' చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.

ప్రభాస్, రానా, అనుష్క ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. కె.రాఘవేంద్రరావు సమర్పకులు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. అనంతరం ఇతర భాషల్లో అనువదించి ఒకేసారి విడుదల చేస్తారు. ఈ సినిమాకోసం ప్రధాన తారాగణమంతా కత్తి యుద్ధాలు, గుర్రపుస్వారీ నేర్చుకుని తమ ప్రతిభను చూపిస్తున్నారు.
ఏప్రియల్ 2015 లో విడుదల అయ్యే ఈ చిత్రం ఓవర్ సీస్ రైట్స్ ని బ్లూ స్కై వారు 9 కోట్లు వెచ్చించి సొంతం చేసుకున్నారు. ఈ తొమ్మిది కోట్లు తొలి భాగం మేరకే అని చెప్తున్నారు. ఈ మేరకు అగ్రిమెంట్ జరిగిందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా సంస్థ నిర్మిస్తోంది.
రమ్యకృష్ణ నెగిటివ్ రోల్ లో బాహుబలి చిత్రంలో కనపించనుంది. అన్నదమ్ములుగా రానా, ప్రభాస్ కనిపిస్తారు. రాజ్యంకోసం జరిగే కుట్రలతో ఈ చిత్రం సాగుతుంది.మరో ప్రక్క ఈ చిత్రం గురించి వినిపిస్తున్న వూహాగానాలు అన్నీ ఇన్నీ కావు. కొబ్బరికాయ కొట్టకముందే బోలెడన్ని కబుర్లు వినిపించాయి. వినిపిస్తున్నాయి. సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తున్నాయి. దాంతో బిజినెస్ కూడా అదే రేంజిలో జరుగుతోంది.


Click it and Unblock the Notifications











