మరో సావిత్రి దొరికింది: రాజమౌళి
''ఈ సినిమాలో నా ముద్ర కనిపిస్తుంది అంటున్నారు. నేను సినిమా గ్రామర్ నేర్చుకున్నదే మా నాన్నగారి దగ్గర. ముందు డెరైక్టర్ అయ్యాను కాబట్టి నా ముద్ర అంటున్నారు. కానీ అది విజయేంద్రప్రసాద్ మార్క్. యాని నటన నిజంగా వండర్. ఆమె నటన చూసి ఇండస్ట్రీకి మరో సావిత్రి, సూర్యకాంతం దొరికింది అనిపించింది'' అన్నారు రాజమౌళి. విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో నాగార్జున నటించి, నిర్మించిన చిత్రం 'రాజన్న'. గురువారం విడుదలైన ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ మీట్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా రాజమౌళిపై విధంగా స్పందించారు.
అలాగే..రాజన్న అనగానే బేబి అని గుర్తుకొస్తుంది. అంత గొప్ప నటన కనబరిచింది. వెయ్ వెయ్.. పాట, పతాక సన్నివేశాల్లో కొంత భాగం మాత్రమే నేను తీశాను. భావోద్వేగాల్ని పండించడం నాన్న నుంచే నేను నేర్చుకొన్నాను అన్నారు రాజమౌళి. ఇక దర్శకుడు విజియేంద్రప్రసాద్ మాట్లాడుతూ...''ఈ కథ తయారు చేయడానికి రెండేళ్లు పడితే... నాగార్జున గారికి చెప్పడానికి మరో రెండేళ్లు పట్టింది. కథ విని ఓకే చెప్పేముందు నాగార్జున ఓ అయిదు సెకండ్లు మౌనం వహించారు. ఆ అయిదు సెకండ్లు నాకు అయిదు యుగాలుగా అనిపించింది. నాగేశ్వరరావుగారి కళ్లు నాగార్జునగారికి వచ్చాయి. ఆయనలో లేని రౌద్రం కూడా నాగార్జునలో కనిపిస్తుంది. అది చూస్తే... నా 'రాజన్న' నా కళ్లముందు కనిపించినట్టు అనిపించింది'' అని విజయేంద్రప్రసాద్ చెప్పారు. ''రాజన్న మా చిన్నాన్న కల. దానికి మేమందరం రంగులద్దితే ఆ కలను నాగార్జున నిజం చేశారు'' అని కీరవాణి అన్నారు.


Click it and Unblock the Notifications











