సంక్రాంతికి రాజమౌళి సర్‌ప్రైజ్
ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న తెలుగు గ్రేట్ డైరెక్టర్లలో రాజమౌళి ఒకరనే విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఆయన తీసిన సినిమాలన్నీ భారీ విజయాలు సాధించాయి. పెద్ద హీరోలతో చేయడం వల్లనే సినిమాలు హిట్టవుతున్నాయి అనే వాదనను తోసి పుచ్చడానికి....కమెడియన్ సునీల్ తో మర్యాద రామన్న సినిమా తీసి హిట్ కొట్టారు రాజమౌళి. తన డైరెక్టన్ స్టామినా ఏమిటో చూపించారు.
ప్రస్తుతం రాజమౌళి 'ఈగ' అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నాని, సమంత ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ఫాంటసీ, ఫుల్ గ్రాఫిక్స్ తో ఉంటుందని ఎప్పటి నుంచే ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ సినిమా ప్రకటించి దాదాపు సంవత్సరన్నర గడుస్తున్న ఇప్పటి వరకు ఎలాంటి వివరాలు బయటకు పొక్కలేదు. కనీసం ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ కాలేదు.
అయితే రాజమౌళి కావాలనే ఇలా చేస్తున్నారని, సినిమాపై అనవసర అంచనాలు పెంచడం ఇష్టం లేకనే సినిమాకు సంబంధించిన ఎలాంటి విషయాలు బయటకు పొక్కనివ్వడం లేదని ఇంతకాలం అంతా చర్చించుకున్నారు. అయితే ఈ సినిమాపై అభిమానుల్లో నెలకొన్న ఉత్కంఠకు తెర దించుతూ...ఈ సంక్రాంతికి 'ఈగ' ఫస్ట్ లుక్ విడుదల చేసేందుకు సిద్ధం అవుతున్నారు రాజమౌళి. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం ఈగ పోస్టు ప్రొడక్షన్ వర్కులో బిజీగా ఉన్నామని, సంక్రాంతికి సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేస్తామని చెప్పారు.


Click it and Unblock the Notifications











