అబద్దం చెప్పలేదు, ప్రజలే నిర్ణయించుకుంటారు, తప్పు నాదే: రాజమౌళి పశ్చాత్తాపం
శ్రీదేవిపై కామెంట్లపై రాజమౌళి పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తాను అలా మాట్లాడి ఉండాల్సింది కాదని విచారం వ్యక్తం చేశారు.
'బాహుబలి-2' ప్రమోషన్లో భాగంగా ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజమౌళి నటి శ్రీదేవి విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శివగామి పాత్ర కోసం శ్రీదేవి గారిని సంప్రదించినపుడు ఆమె భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేశారని, రూ. 8 కోట్ల రెమ్యూనరేషన్ తో పాటు షూటింగుకు వచ్చిన ప్రతిసారి 5 బిజినెస్ క్లాస్ ఫ్లైట్ టిక్కెట్లు, బిగ్గెస్ట్ హోటల్‌లో 5 సూట్లు... ఏర్పాట్లు చేయాలని ఆమె కోరినట్లు రాజమౌళి తెలిపారు.
'మామ్' మూవీ ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్ వచ్చిన శ్రీదేవి..... రాజమౌళి కామెంట్లపై స్పందించారు. రాజమౌళి తన గురించి చేసిన వ్యాఖ్యలకు ఎంతో బాధపడ్డానని అన్నారు. తాను అలాంటి గొంతెమ్మ కోరికలు కోరి ఉంటే 300 సినిమాలు చేసేదాన్ని కాదు, 50 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉండేదాన్ని కాదు అని ఆమె అన్నారు.

ఎవరి వెర్షన్ నమ్మాలో ప్రజల ఇష్టం
తాజాగా ఓ ఆంగ్లపత్రికతో రాజమౌళి మాట్లాడుతూ..... నేను చెప్పింది నమ్మాలో లేక శ్రీదేవి చెప్పింది నమ్మాలో ప్రజలు నిర్ణయించుకుంటారు. నేను మాత్రం అబద్దం చెప్పలేదు అని రాజమౌళి అన్నారు.

తప్పు నాదే అంటూ రాజమౌళి పశ్చాత్తాపం
ఈ విషయంలో తప్పు నాదే. శ్రీదేవి రెమ్యూనరేషన్ గురించి ఆరోజు నేను మాట్లాడి ఉండాల్సింది కాదు. నా నుండి ఇలాంటి తప్పు జరిగినందుకు విచారిస్తున్నాను అని రాజమౌళి పశ్చాతాపం వ్యక్తం చేశారు.

అప్పట్లో రాజమౌళిపై విమర్శలు
ఏదైనా సినిమా ఒప్పుకోవాలా? వద్దా? అనేది ఆయా నటీనటుల ఇష్టా ఇష్టాలపై ఆధారపడి ఉంటుంది. కథ నచ్చక పోయినా, పాత్ర నచ్చక పోయినా, లేదా వారికి ఆఫర్ చేసిన రెమ్యూనరేషన్ నచ్చక పోయినా.... తిరస్కరించడం వారి హక్కు. ఇలాంటివి ఇండస్ట్రీలో సర్వ సాధారణం. ఇవన్నీ అంతర్గత విషయాలు. దర్శక నిర్మాతలు కూడా.... ఎవరైనా హీరో లేదా హీరోయిన్‌ను సంప్రదించినపుడు జరిగిన ఈ అంతర్గత విషయాలను బయట పెట్టరు... పెట్టకూడదు కూడా. కానీ రాజమౌళి శ్రీదేవి విషయాలు బయట పెట్టడం అప్పట్లో విమర్శలకు దారి తీసింది.

శ్రీదేవి చాలా బాధ పడింది
50 ఏళ్ల కెరీర్లో శ్రీదేవి మీద ఎలాంటి మచ్చలు లేవు. కానీ రాజమౌళి లాంటి దర్శకుడు తన ప్రతిష్ట దిగజార్చే విధంగా మాట్లాడటం శ్రీదేవిని నొప్పించింది. అయితే ఆమె ఈ వివాదంపై హుందాగా స్పందించడం గమనార్హం. రాజమౌళి అంటే తనకెంతో గౌరవమని, ఆయన దర్శకత్వం వహించిన 'ఈగ' చిత్రం అద్భుతమని చెప్పిన శ్రీదేవి.... అలాంటి దర్శకుడు తన గురించి అలా మాట్లాడటం పద్దతిగా అనిపించలేదని, మనసుకు బాధ కలిగించిందని చెప్పారు. పబ్లిక్ ప్లాట్ ఫాంపై చెప్పడం, ఇలా మాట్లాడటం మంచి పద్ధతి అనిపించుకోదు అన్నారు.

బ్యాడ్ గా ఫీలయ్యా
రాఘవేంద్ర రావు, అశ్వనీదత్ వంటి వారెందరో తమ సినిమాల్లో రిపీటెడ్ అవకాశాలు ఇచ్చారు. అలాంటి నా గురించి రాజమౌళి లాంటి వారు ఇటు వంటివి విన్నప్పుడు యూ ఫీల్ బ్యాడ్. ఎందుకు ఇలా చెప్పాలి? శ్రీదేవి ప్రశ్నించారు. రాజమౌళి చాలా కామ్, డిగ్నిఫైడ్ దర్శకుడని అనుకున్నా. బాహుబలి లాంటి సినిమా తీసినందుకు రాజమౌళిని అభినందిస్తున్నానని, ఆయన ఇలాంటి మంచి సినిమాలు మరిన్ని తీయాలని కోరుకుంటున్నానని అన్నారు శ్రీదేవి.


Click it and Unblock the Notifications











