వివాదంలో ఉన్న సినిమాకు రాజమౌళి మద్దతు
హైదరాబాద్: దర్శకుడు రాజమౌళి తనకు ఏదైనా సినిమా నచ్చితే వెంటనే ఆ సినిమాపై తన అభిప్రాయాన్ని తన సోషల్ నెట్వర్కింగ్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటారు. ఆయన ఏదైనా సినిమా బావుందని ట్వీట్ చేసాడంటే....ఆ సినిమాకు భారీగా కలెక్షన్లు పెరిగిపోతుంటాయి. ఆయన పుణ్యమా అని పెద్దగా స్టార్స్ లేని సినిమాలు సైతం లాభాల బాట పట్టాయి.
ఇటీవల విడుదలైన అమీర్ ఖాన్ ‘పికె' చిత్రంపై కూడా రాజమౌళి తన ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘పికె' చిత్రం ఇది వరకు ఎప్పుడూ రాని ఓ గొప్ప చిత్రం అంటూ రాజమౌళి వ్యాఖ్యానించారు. అందులోని కొన్ని వివాస్పదన డైలాగులను తాను పట్టించుకోవడం లేదనే విధంగా రాజమౌళి వ్యాఖ్యలు ఉన్నాయి.

అయితే ఓ వైపు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా సినిమాలోని డైలాగులు ఉన్నాయని వివాదం నడుస్తున్న నేపథ్యంలో రాజమౌళి ఇలా వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ అయింది. మీర్ ఖాన్ హీరోగా తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం ‘పికె'పై పలు పిటీషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దేశవ్యాప్తంగా నిలిపివేయాలని కొందరు ఆలహాబాద్ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సినిమాలో ప్రత్యేకించి హిందూ దేవుళ్లనే టార్గెట్ చేసారని, హిందూదేవుళ్లపై సెటైర్లు వేసారంటూ ఆ చిత్ర దర్శకుడిపై కేసులు కేసులుపెట్టారు.
సినిమాలో కొన్ని సంభాషణలు హిందువుల్ని కించపరిచేలా ఉన్నాయని ముఖ్యంగా ‘‘భయపడే వాళ్లే దేవాలయాలకు వెళ్తుంటారు'' అనే డైలాగు హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని లక్నోకు చెందిన హిందూ ఫ్రంట్ ఫర్ జస్టిస్ అనే సంస్థ పిల్‌ను దాఖలు చేసింది.
‘పికె' చిత్రం విషయానికొస్తే....అమీర్ ఖాన్, అనుష్క శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈచిత్రాన్ని రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించారు. రాజ్ కుమార్ హిరానీ, విధు వినోద్ చోప్రా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం విడుదలైన రోజే హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం వసూళ్లు 200 కోట్లకు చేరువయ్యాయి.


Click it and Unblock the Notifications











