అంతా రాజమౌళే... (వన్‌ఇండియాతో ఈగ విలన్)
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఈగ' చిత్రం సూపర్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంతో పాటు ఈచిత్రంలో విలన్ రోల్ పోషించిన కన్నడ హీరో సుదీప్ కూడా మంచి మార్కులు కొట్టేశాడు. ఇప్పటి వరకు కర్నాటకకు మాత్రమే పరిమితం అయిన సుదీప్ స్టార్ ఇమేజ్... ఈగ చిత్రం పుణ్యమా అని సౌతిండియాలో పాపులారిటీ పెంచుకోవడమే కాదు...బాలీవుడ్ జనాలకు కూడా సుదీప్ టాలెంట్ ఏమిటో తెలిసిపోయింది. ఈగ సక్సెస్‌ను పురస్కరించుకుని సుదీప్...వన్ ఇండియాకు ప్రత్యేకంగా ఇంటర్య్వూ ఇచ్చారు. ఆ విశేషాలు ఏమిటో చూద్దాం.
ఈగ విజయంతో సౌతిండియాలో కొత్త సూపర్ స్టార్‌గా ఎదిగారు. ఆ ఫీలింగ్ ఎలా ఉంది?
'సూపర్ స్టార్' అనేది చాలా పెద్ద పదం. నేను నటించిన ఈగ చిత్రం మంచి విజయం సాధించడం చాలా ఆనందంగా ఉంది. మా కష్టానికి తగిన ప్రతిఫలం లభించింది. నెగెటివ్ రోల్ చేసిన నాకు ఇంత మంచి పేరు రావడం నేను ఊహించలేదు. మంచి గుర్తింపు రావాలని ప్రతి నటుడు కోరుకుంటాడు. ఈ విజయాన్ని నేనే చాలా ఎంజ్ చేస్తున్నాను. ఈ గొప్పతనం అంతా రాజమౌళిదే.
ఈగ చిత్రం ఇంత పెద్ద విజయం సాధించడం వెనక కారణం మిటి?
ఈగ చిత్రం ఇంత పెద్ద విజయం సాధించడానికి కారణం రాజమౌళి దర్శకత్వం, ఆయన ఆలోచనలే. ఆయన చెప్పినట్లు అంతా కష్టపడి పని చేశాం. రాజమౌళిపై నమ్మకంతోనే నిర్మాతలు ప్రయోగాత్మక చిత్రానికి భారీ మొత్తం ఖర్చు పెట్టారు. సురేష్ బాబు, సాయి ధైర్యాన్ని నిజంగా మెచ్చుకోవాల్సిందే.
రెగ్యులర్ చిత్రం కాని 'ఈగ' ఇంత పెద్ద హిట్టవుతుందని సినిమా ఒప్పుకునే ముందు నమ్మారా?
నిజం మాట్లాడుతున్నా, ఈ సినిమా ఒప్పుకునే ముందు తనకు సినిమాపై ఎలాంటి అంచనాలు లేవు. ఈగ పూర్తిగా కొత్త సబ్జెక్టు. కానీ రాజమౌళి చేయగలరే నమ్మకం మాత్రం ఉండేది. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా రాజమౌళి అద్భుతంగా సినిమా తీశారు. ఇలాంటి చిత్రం రావడం భారతీయ సినీ పరిశ్రమ గవర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవల్లో ఈగ చిత్రంపై చర్చ సాగుతోంది. అమెరికా జర్నలిస్టులు కూడా ఈగ చిత్రం గురించి రాశారు. ఈ క్రెడిట్ అంతా రాజమౌళికే దక్కుతుంది. ఆయన పని తనానికి హాట్సాఫ్.
పెద్ద పెద్ద స్టార్ల నుంచి అభినందనలు వస్తున్నాయి కదా ఎలా ఉంది ఆ ఫీలింగ్?
రజనీకాంత్, మహేష్ బాబు, నాగార్జున, సూర్య, పూరి జగన్నాథ్, రవితేజ, వివి వినాయక్ లతో పాటు చాలా మంది నాకు ఫోన్ చేసి నన్ను అభినందించారు. నా జీవితంలో ఇలాంటి క్షణాలను ఎప్పుడూ చూడలేదు. మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది.
మీరు ఒక దర్శకులే కదా...మరి రాజమౌళి నుంచి ఏం నేర్చుకున్నారు?
నేను ముందు ఆయన దగ్గర నేర్చుకుంది ఓ గుడ్ స్టూడెంట్ ఎలా ఉండాలి అనేది. ఆయన ప్రతి ఒక్కరి దగ్గరి నుంచి కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. పని పట్ల ఆయన అంకిత భావం, ఓర్పు నిజంగా అభినందించ దగ్గ విషయం. ఒక్కోసారి ఆయన చేసే హార్డ్ వర్క్ కింద మనం చాలా తక్కువ అనిపిస్తుంది.
కర్నాటకలో ఈగ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే తెలుగు బాషలో చూడటం వల్ల వాళ్లకి పూర్తి సంతృప్తి లేదు. కర్నాటకలో డబ్బింగ్ సినిమాలు నిషేదం. దీనిపై మీరేమంటారు?
నేను రూల్స్ ఫాలో అవుతాను. కన్నడలో డబ్బింగ్ సినిమాలు నిషేదించడం అనేది పరిశ్రమ పెద్దలు తీసుకున్న నిర్ణయం. నా అభిమానులైతే ఎలాంటి కంప్లైంట్ లేకుండా సినిమా చూస్తున్నారు. ఇక్కడి చిత్రాలు తెలుగు, తమిళంలో డబ్ అవుతున్నాయి. మరి అక్కడి చిత్రాలు ఇక్కడ ఎందుకు నిషేదించారో మీరు అడగండి. ప్రేక్షకులకు అన్నీ తెలుసు. మంచి సినిమాలను ఎప్పుడూ ఆదరిస్తారు. డబ్బింగ్ చేయడం నిషేదించినంత మాత్రాన ప్రేక్షకులు వాటిని చూడరు అని అనుకోవడం పొరపాటే.
కన్నడ, తెలుగు సినీ పరిశ్రమలకు తేడా ఏమైనా గమనించారా?
నేను కేవలం ఒక్క రాజమౌళితోనే పని చేశాను. నాకు తెలిసినంత వరకు పెద్ద తేడాలు ఏమీ లేవు. ఇక్కడ ఒప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే తెలుగు ఇండస్ట్రీలో చాలా హోమ్ వర్క్ చేస్తారు. వారి ప్రిపరేషన్ లెవల్స్ హై రేంజిలో ఉంటాయి. అయితే కన్నడ సినిమా మార్కెట్ చాలా చిన్నది. మేము మా లిమిట్స్ దాటలేక పోతున్నాం. మంచి సినిమాలు తీసే సత్తా కన్నడవారికి కూడా ఉంది. ఏదో ఒక రోజు తెలుగు సినీ పరిశ్రమను కన్నడ సినీ పరిశ్రమ మించిపోతుందనే నమ్మకం ఉంది.


Click it and Unblock the Notifications











