హాట్ టాపిక్ :పరమేశ్వరునిగా.. రజనీకాంత్
హైదరాబాద్ : రజనీకాంత్ త్వరలో తన భక్తులను కాపాడే పరమేశ్వరుడుగా కనిపించనున్నారు. ఈ పాత్ర రజనీకాంత్ 'కొచ్చాడియాన్' లోనిది. ఈ చిత్రం జూలై 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా రజనీకాంత్ కుమార్తె, చిత్ర దర్శకురాలు సౌందర్య ఆర్.అశ్విన్ తన ట్విట్టర్‌లో రజనీ ప్రత్యేక చిత్రాలను పోస్ట్ చేసింది.
కొద్ది నెలలుగా సూపర్ స్టార్ రజనీకాంత్ అనారోగ్యంతో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. వైద్యుల పర్యవేక్షణలో పూర్తి స్వస్థత చేకూరిన రజనీని తొలిసారిగా ఈ చిత్రాల్లో చూసిన అశేష అభిమానులు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. సౌందర్య తన మైక్రో-బ్లాగింగ్ పేజ్‌లో ఈ ఫొటోలను చూసి తమ అభిమానాన్ని చాటారు. రూ.125 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న 'కొచ్చాడియన్' 3డి చిత్రంలో మహారాజు కొచ్చాడియన్‌గా.. భక్తులను సర్వదా కాపాడే పరమేశ్వరునిగా.. రజనీ అలరించనున్నాడు.
62 ఏళ్ల రజనీ పెర్‌ఫార్మెన్స్‌ని సరికొత్త కోణంలో చూపించనున్నట్టు సౌందర్య తెలిపారు. స్టీవెన్ స్పీల్‌బర్గ్ 'ది అడ్వంచర్స్ ఆఫ్ టిన్‌టిన్: ది సీక్రెట్స్ ఆఫ్ ది యూనికార్న్' చిత్రానికి పనిచేసిన సాంకేతిక నిపుణులు, జేమ్స్ కామెరూన్ 'అవతార్' చిత్రాన్ని డిఫరెంట్‌గా అందించిన టెక్నీషియన్లు ఈ చిత్రాన్ని అందంగా తీర్చిదిద్దినట్టు.. భారతీయ సినిమాలో పూర్తి స్థాయిలో హాలీవుడ్ టెక్నాలజీని ఉపయోగించినట్టు సౌందర్య పేర్కొన్నారు.
ఈ చిత్రం కథ గురించి ఆయన కుమార్తె సౌందర్య మీడియాతో మాట్లాడారు. ఆమె మాటల్లోనే... ఇందలో ఇద్దరు రజనీలు ఉంటారు. ఇందులో సీనియర్ రజనీయే 'కోచ్చడయాన్'. ఆయనో దళపతి. తమ దేశపు రాజుకు కోచ్చడయాన్ మంచి స్నేహితుడు. ఆ మిత్రుడి కోసం ప్రపంచాన్నే జయించి.. ఆ విజయాన్ని రాజుకు సమర్పించాలని ఉత్సాహపడే సైనికుడు. అంతేకాదు.. కోచ్చడయాన్ భరతనాట్య కళాకారుడు కూడా. యుద్ధంలో ఆక్రోశంగా, వీరోచితంగా పోరాడే కోచ్చడయాన్.. వెనువెంటనే అందమైన అభినయంతో నృత్యం చేస్తారు. అలాంటి పాత్రకు ఎవర్ని హీరోయిన్ గా తీసుకుందామా.. అని ఆలోచించాం. అప్పుడు మా అందరికీ తోచిన పేరు శోభన.
అలాగే...ఇందులో తండ్రి 'కోచ్చడయాన్'.. కుమారుడు 'రాణా'. తండ్రిని మించిన తనయుడు. తండ్రితో పోల్చితే వందరెట్లు వేగంగా దూసుకుపోయే వ్యక్తి. రజనీకాంత్ అభిమానిగా చెబుతున్నా.. కచ్చితంగా వందశాతం కమర్షియల్ హంగులు ఇందులో ఉన్నాయి. ఇదివరకు నాన్న పోషించని పాత్ర ఇది. అభిమానులు ఎదురుచూసే అన్ని అంశాలు ఇందులో ఉంటాయి. ఇందులో ఓ సన్నివేశంలో ఠీవీగా, స్త్టెల్‌గా ఓ పంచ్ డైలాగు చెప్పి.. ఇంకాస్త స్త్టెల్‌గా నడిచివెళ్తుంటారు.. ఆ సన్నివేశాన్ని చూసి యూనిట్ మొత్తం క్లాప్ కొట్టింది అని చెప్పారు.


Click it and Unblock the Notifications











