జగన్‌ని కలిసిన జీవిత, రాజశేఖర్.. మా మధ్య విభేదాలు నిజమే, కానీ!
Recommended Video

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సినీ సీలెబ్రిటీలు వరుసగా వైసిపిలో చేరుతున్నారు. ప్రముఖనటులు అలీ, పృథ్వి, రచయిత చిన్ని కృష్ణ వైసిపి తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా అనేక పరిణామాల తర్వాత జగన్ సమక్షంలో వైసిపిలో చేరారు. మోహన్ బాబు ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుని తీవ్రంగా విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా జీవిత, రాజశేఖర్ దంపతులు కూడా జగన్ ని కలసి వైసిపిలో చేరారు.

వైఎస్ఆర్ ఉన్నప్పుడు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు జీవిత, రాజశేఖర్ ఆయనకు మద్దతుగా నిలిచారు. వైఎస్ ఫ్యామిలీతో సన్నిహితంగా మెలిగారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత జగన్ కాంగ్రెస్ నుంచి విడిపోయి వైసిపి పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా జీవిత, రాజశేఖర్ వైఎస్ ఫ్యామిలీతో టచ్ లో లేరు. జగన్, రాజశేఖర్ దంపతుల మధ్య విభేదాలు తలెత్తాయని అప్పట్లో వార్తలు వచ్చాయి.

ఊహించని ట్విస్ట్
తాజాగా రాజశేఖర్ దంపతులు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. లోటస్ పాండ్ లోని నివాసంలో రాజశేఖర్ దంపతులు జగన్ ని కలసి వైసిపిలో చేరారు. ఇటీవల రాజశేఖర్, జీవిత మా అసోసియేషన్ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. నరేష్ ఫ్యానల్ తరుపున వీరిద్దరూ మా ఎన్నికల్లో సభ్యులుగా పోటీ చేసి విజయం సాధించారు. ఇప్పుడు జగన్ ని కలవడంతో రాజకీయంగా కూడా జీవిత, రాజశేఖర్ గురించి చర్చ మొదలైంది.

విభేదాలు నిజమే
జగన్ ని కలసిన అనంతరం రాజశేఖర్ మీడియాతో మాట్లాడుతూ.. చాలా రోజుల తర్వాత జగన్ ని కలవడం సంతోషంగా ఉంది. మా మధ్య కొన్ని మనస్పర్థలు నెలకొన్న మాట నిజమే. అవన్నీ ఈ రోజుతో తొలగిపోయాయి. మా మధ్య శత్రుత్వం లేదు. ఆ మనస్పర్థలు ఎందుకో ఎలా వచ్చాయి. బహుశా నా అపరిపక్వత వల్లే కావచ్చు. యువకుడైన జగన్ కు ప్రజలు ఒక్క అవకాశం ఇవ్వాలి. జగన్ ముఖ్యమంత్రి అయ్యేందుకు తమవంతు కృషి చేస్తాం అని రాజశేఖర్ మీడియాకు వివరించారు.

కష్టపడకుండానే సీఎం
జీవిత మాట్లాడుతూ.. కొంత మంది తమ కొడుకుని కష్టపెట్టకుండానే సీఎంని చేయాలని చూస్తున్నారు. అలాంటి వాళ్ళు మనకు వద్దు. జగన్ లాగా కష్టపడేవాళ్ళే ఈ రాష్ట్రానికి కావాలి అని జీవిత అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చే డబ్బు, చీరలకు ఓటర్లు ఎవరూ ఆశపడొద్దని సూచించారు. ఆంధ్రప్రదేశ్ కు మంచి భవిష్యత్తు జగన్ తోనే సాధ్యం అని జీవిత అన్నారు. ప్రస్తుతం రాజశేఖర్ కల్కి చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











