కూతుర్లను తెరవెనక్కి తోసేస్తున్న రాజశేఖర్
సినిమాలతో పాటు వివాదాలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు సినీ కపుల్ జీవిత రాజశేఖర్. ఈ మధ్య పెద్దగా హిట్లు లేకున్నా....తనదైన శైలిలో అడపా దడపా సినిమాలు చేస్తూ పరిశ్రమలో అలా లాగించేస్తున్నాడు రాజశేఖర్. తాజాగా తన భార్య జీవిత దర్శకత్వంలో రాజశేఖర్ చేస్తున్న సినిమా 'మహంకాళి". ఈ సినిమా ఆడియో శనివారం సాయంత్రం సినీ ప్రముఖులు అక్కినేని నగేశ్వరరావు, కృష్ణ, విజయనిర్మాల, రాజమౌళి, కీరవాణి, చలపతిరావు తదితర సినీ ప్రముఖుల సమక్షంలో హైదరాబాద్ లో ఆవిష్కరించారు. ఆడియో వేడుక సందర్భంగా రాజశేఖర్ ఇద్దరు కూతుర్లు పాటలు పాడి అలరించారు.
మహంకాళి సినిమా విషయాలు పక్కన పెడితే....సాధారణంగా సినీ ప్రముఖులంతా తమ వారసులను తెరపైకి తోయడానికే ఇష్ట పడుతుంటారు. అంటే హీరోగానో, హీరోయిన్ గానో, ప్రాముఖ్యత ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టుగానో ఇలా తెరపై కనిపించే విభాగాల వైపు ప్రోత్సహిస్తుంటారు. అయితే హీరో రాజశేఖర్ మాత్రం తన కూతుర్లను తెర వెనక్కి తోయడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో వారు తెర వెనక విభాగాలకే పరిమితం అయ్యే పరిస్థితులు న్పష్టంగా కనిపిస్తున్నాయి. వారిని ప్లేబ్యాక్ సింగర్లుగా తీర్చిదిద్దే ఆలోచనలో ఉన్నారని సినీ వర్గాల సమాచారం. కూతురు విషయంలో జీవిత రాజశేఖర్ మధ్య గొడవలొచ్చాయని, వారిని హీరోయిన్లను చేద్దామని జీవిత పట్టుబడితే...వీల్లేదని రాజశేఖర్ గొడవకు దిగారని వార్తలొచ్చాయి కూడా. దీంతో కనీసం ఈ విషయంలోనైనా రాజశేఖర్ మాట నెగ్గిందని గుసగుసలాడుకుంటున్నారు సినీ జనాలు.


Click it and Unblock the Notifications











