చిరు యస్ అంటే..
చిరు చిటికేస్తే చీకటంత చిత్తయిపోతుంది..
నిజమే!
చిరు చెయ్యేస్తే.. చిలుక కూడా చిందేస్తుంది..
అదీ నిజమే!
కానీ అన్నిసార్లూ చిరు యస్ అంటే.. అది అయిపోయినట్టు కాదు. దానికి చాలా కథంటుంది. చాలా లెక్కలుంటాయి.
డాన్స్ డైరెక్టర్లకు ఇప్పుడు కాలం చాలా అనుకూలంగా ఉంది. లారెన్స్‌కు నాగార్జున అప్పుడే రెండో ఛాన్స్ ఇస్తుంటే, తానూ తక్కువ తీసిపోనంటూ మెగాస్టార్ చిరంజీవి ఈసారి అమ్మ రాజశేఖర్‌కు ఛాన్స్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. రణం చిత్రం ద్వారా మంచి మాస్ డైరెక్టర్‌గా పేరు సంపాదించిన అమ్మ రాజశేఖర్ ప్రస్తుతం రవితేజ, ఇలియానా జంటగా ఛత్రపతి ప్రొడ్యూసర్ బివిఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మాణంలో ఒక చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.
ఈమధ్య రాజశేఖర్ చిరంజీవిని కలిసి ఒక కథ చెప్పారని, అది చిరంజీవికి బాగా నచ్చి వర్కవుట్ చేయమన్నారని టాలీవుడ్ తాజా సమాచారం. స్టాలిన్ తర్వాత చిరంజీవి చేయబోయే ప్రాజెక్టు గురించి విపరీతమైన వార్తలూ, వదంతులూ ప్రచారంలోకి వచ్చాయి. పి. వాసు అనీ, చిరంజీవే స్వయంగా ఒక చారిత్రక చిత్రం చేస్త్నునారని ఇలా అనేక కథనాలు, ఊహాగానాలు బయటకొచ్చాయి. అయితే, చిరంజీవి నుంచి ఇప్పటికీ అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు.
చిరంజీవితో చిత్రం చేయడం అంత ఆషామాషీ కాదు. ఆయన ఓకె చెప్పినంత మాత్రాన వెంటనే సినిమా ప్రారంభం అవుతుందన్న గ్యారెంటీ కూడా లేదు. కారణం సబ్జెక్టుతో పాటు ఇంకా అనేక లెక్కలు ఆయన నిర్ణయంలో ఇమిడి ఉంటాయి. అమ్మ రాజశేఖర్ కథ చెప్పగానే సరిపోదు. ఆయనకు ఇంకో గండం కూడా ఉంది. రాజశేఖర్ ప్రస్తుతం చేస్తున్న చిత్రం గనుక విడుదలై హిట్ సాధిస్తేనే ఆయనకు అధికారికంగా చిరంజీవి నుంచి ఆమోదం లభిస్తుంది. అదే ఫలితం ఇంకోలా ఉంటే, చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశం చేజారిపోతుంది. గతంలో పలువురు యువదర్శకులకు ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రాజశేఖర్ ముందు చిరు ప్రాజెక్ట్ గురించి కాకుండా, తను చేసే చిత్రాన్ని హిట్ చేయడానికి ఎక్కువ తాపత్రయపడాలి. అప్పుడే అమ్మ రాజశేఖర్‌కు చిరు ప్రాజెక్టు దక్కేది. ఆయనను అంతా హమ్మ రాజశేఖర్ అనేది!


Click it and Unblock the Notifications