గో టు విలేజెస్ ...(‘ఓనమాలు’ప్రివ్యూ)
డా.రాజేంద్రప్రసాద్ ప్రధానపాత్రలో క్రాంతిమాధవ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన 'ఓనమాలు' ఈ రోజు(జూలై 27)విడుదల అవుతోంది. రాజేంద్రప్రసాద్ ..నారారణరావు మాస్టారిగా చేసిన ఈ చిత్రం 'ఆ నలుగురు'ని గుర్తు చేస్తుంది అంటున్నారు. "అమ్మ ఒడిలో ఉండే వెచ్చదనం ఎంత హాయిగా ఉంటుందో, ఈ పాత్ర చేస్తున్నప్పుడు అంత హాయి అనుభవించాను. ఈ సినిమా చూశాక భావోద్వేగంతో మీ కళ్లు చెమ్మగిల్లకపోతే ఇక నేను మీకు కనిపించను" అని రాజేంద్రప్రసాద్ భావోద్వేగంతో చెప్తున్నారు.
నారాయణరావు (రాజేంద్రప్రసాద్) ఓ గ్రామంలో ఉపాధ్యాయుడు. పదవీవిరమణ తరవాత అమెరికాలోని కొడుకు దగ్గరకు వెళ్లిపోతాడు. ఆ దేశంలో ఉన్నా సొంత వూరుపైనే ఎప్పుడూ ధ్యాస. పదేళ్ల తరవాత తన వూరుకి వస్తాడు నారాయణరావు మాస్టారు. అతనికి అక్కడెలాంటి పరిస్థితులు తారసపడ్డాయి? మాస్టారి దగ్గర చదువుకొన్న పిల్లలు ఏ రీతిన స్థిరపడ్డారు? వారికి నేర్పిన విద్య ఏ మేరకు అక్కరకొచ్చింది? అన్నది తెర మీదే చూడాలి.
రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ...''నటుడిగా నా వయసు 35 ఏళ్లు. ఏ రంగంలో అయినా 35 ఏళ్లు పనిచేస్తే రిటైరైపోతారు. కానీ ఈ సినిమాతో దర్శకుడు క్రాంతి మాధవ్ మళ్లీ నా కెరీర్‌కి 'ఓనమాలు' దిద్దారు. ఇలా మళ్లీ మళ్లీ కెరీర్‌లో పునరుత్తేజం పొందడం నిజంగా నా అదృష్టం'' అని. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో రాజేంద్రప్రసాద్ ఉద్వేగంగా మాట్లాడారు. '''ఆ నలుగురు' చేసిన దగ్గర్నుంచీ అలాంటి పాత్రలు మళ్లీ మళ్లీ చేయమని చాలామంది అడుగుతుంటారు. కానీ అందుకు తగ్గ కథ దొరకాలి. అలాంటివి అరుదుగా మాత్రమే దొరుకుతాయి. 'ఓనమాలు' ఆ రకంగా అరుదుగా దొరికిన కథ. ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి మహానటులకే ఇలాంటి పాత్రలు దక్కాయి. మళ్లీ నా కోసం ఇలాంటి పాత్రలు పుట్టడం నిజంగా నా అదృష్టం. ఎన్ని పాత్రలు చేసినా వాటిల్లో కొన్ని పాత్రలు మాత్రమే గుర్తుండిపోతాయి. 'ఓనమాలు'లోని నారాయణరావు మాస్టారి పాత్ర నా గుండెల్లో దాచుకోవాల్సిన పాత్ర అన్నారు.
దర్శకనిర్మాత మాట్లాడుతూ -''స్టోరీ ఈజ్ గాడ్, కంటెంట్ ఈజ్ కింగ్ అని నమ్మి ఈ సినిమా తీశాం...సొంత వూరు గొప్పతనం ఏమిటో తెలియజెప్పే కథ ఇది. ఉరుకుల పరుగుల జీవితంలో మనం ఏ కోల్పోతున్నామో ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. రాజేంద్రప్రసాద్ నటన, ఖదీర్‌బాబు సంభాషణలు ఈ సినిమాకి ప్రధాన బలం'' అన్నారు.
సంస్థ: సన్‌షైన్ సినిమా
నటీనటులు: రాజేంద్రప్రసాద్, కల్యాణి, రవిప్రకాష్, చలపతిరావు, గిరిబాబు, రఘుబాబు, కొండవలస, శివపార్వతి, మీనా తదితరులు.
కథ: తమ్ముడు సత్యం
మాటలు: ఖదీర్ బాబు
దర్శక నిర్మాత: క్రాంతిమాధవ్
విడుదల: జూలై 27,2012.


Click it and Unblock the Notifications











