ప్రశంసలతో ముంచెత్తిన చిరంజీవి, రజనీకాంత్
హైదరాబాద్: ఫర్హాన్ అక్తర్ హీరోగా రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా దర్శకత్వంలో రూపొందిన 'భాగ్ మిల్ఖా భాగ్' చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఒకప్పటి ఇండియన్ స్టార్ అథ్లెట్ మిల్కా సింగ్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈచిత్రంలో హీరో పర్హాన్ అక్తర్ నటన ఇప్పటికే పలువురి ప్రశంసలు అందుకుంది.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా పర్హాన్ అక్తర్ నటనను ప్రశంసించారు. సినిమా ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని పొగడ్తలు గుప్పించారు. యువతలో స్ఫూర్తిని నింపే విధంగా సినిమా ఉందని వారు చెప్పకొచ్చారు.

దేశ విభజన సమయంలో పాకిస్థాన్‌లో మిల్ఖా సింగ్ అనే బాలుడి కుటుంబ ఊచకోతకు గురవుతుంది. బ్రతికి బయట పడ్డ మిల్ఖా సింగ్ ఢిల్లీ చేరుకుంటాడు. దుర్భర పరిస్థితులు, నేరాలు చేస్తూ పెరిగిన ఆ బాలుడు ఆ తర్వాత సైన్యంలో చేరి జవాన్‌గా ఎలా మారాడు, దేశం గర్వించదగ్గ అథ్లెట్‌గా మారడానికి దారి తీసిన సంఘటనలను సినిమాలో చూపించారు.
ఓ అథ్లెట్ జీవితంలో చోటు చేసుకున్న ఒడిదుడుకులకు తోడుగా డ్రామా, ఎమోషన్, హ్యూమర్, విషాదం అనే అంశాలతో పాటు సృజనాత్మకతను జోడించడంలో రచయిత ప్రసూన్ జోషి సక్సెస్ అయ్యారు. ఆయన అందించిన స్క్రీన్ ప్లే, మాటలు భాగ్ మిల్ఖా భాగ్ చిత్రం విజయానికి కారణం అయింది.
మిల్ఖా సింగ్ పాత్రను పోషించిన ఫర్హాన్ అక్తర్....పాత్రలో ఒదిగిపోయాడు. ఓ అథ్లెట్ పాత్రలో నటించడానికి తన దేహాన్ని పూర్తిగా మార్చుకోవడానికి ఫర్హాన్ అక్తర్ పడిన కష్టం, తాపత్రయం, కృషి అద్భుతం. ఒకరకంగా ఆ పాత్రలో ఫర్హాన్ అక్తర్ పరకాయ ప్రవేశం చేసాడని చెప్పొచ్చు.


Click it and Unblock the Notifications











