కంటి చూపుతోనే చంపేస్తాడు.. అది బాలకృష్ణకే సాధ్యం.. రజనీకాంత్ ఎమోషనల్ స్పీచ్
నటరత్న స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు విజయవాడలో అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున్న తెలుగు దేశం నేతలు, పార్టీ కార్యకర్తలు, వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. ఈ వేడుకలో సూపర్ స్టార్ రజనీకాంత్, నందమూరి బాలకృష్ణ చంద్రబాబు నాయుడు, సీనియర్ జర్నలిస్టు వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకలో రజనీకాంత్ చంద్రబాబు, బాలకృష్ణపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ గురించి రజనీకాంత్ మాట్లాడుతూ..
బాలయ్య ఒక్క తన్ను తన్నితే: కంటి చూపుతోనే చంపేసే నా మిత్రుడు. ఒక్క తన్ను తన్నితే జీపు 30 ఫీట్లు ఎగిరిపడుతుంది. రజనీకాంత్ కాదు. అమితాబ్ బచ్చన్ కాదు. షారుక్ ఖాన్ కాదు. సల్మాన్ ఖాన్ కాదు.. ఎవరు చూసినా ఒప్పుకోరు. కేవలం బాలకృష్ణ చేస్తే ఒప్పుకొంటారు. ఎందుకంటే.. జనాలు బాలయ్యలో ఎన్టీఆర్‌ను చూస్తున్నారు. ఎన్టీఆర్ యుగపురుషుడు. ఆయన ఏం చేసినా ప్రజలు ఒప్పుకొంటారు అని రజనీకాంత్ అన్నారు.
ఎన్టీఆర్ జీవితం నాపై చాలా ప్రభావం: ఎన్టీఆర్‌తో నాకు మంచి పరిచయం ఉంది. ఆయన చాలా కోపిష్టి. కానీ మనసు చాలా మంచిది. చాలా కాలం నటుడిగా, రాజకీయాల్లో రాణించారు. ఇంకా ఎన్టీఆర్ గురించి ఏం చెప్పగలను. ఆయన ప్రభావం నాపై చాలా ఎక్కువగా ఉంది. ఆయన నుంచి నేర్చుకొన్నది మీకు చెబుతాను. నాకు 6 ఏళ్ల వయసులో ఎన్టీఆర్ నటించిన పాతాళభైరవి సినిమా చూసిన తర్వాత.. నా మనసులో పాతుకుపోయింది అని రజనీకాంత్ తెలిపారు.

నా ఫస్ట్ సినిమా ఫస్ట్ షాట్‌లో: నా తొలి సినిమా అపూర్వ రాంగాంగల్ ఫస్ట్ షాట్ తీసేటప్పుడు.. నా తొలి డైలాగ్ భైరవి ఇల్లు ఇదేనా అని అడుగుతాను. ఆ తర్వాత నన్ను హీరోగా యాక్ట్ చేయమని చెప్పారు. అయితే హీరో ఎందుకు.. విలన్‌గా చేస్తే డబ్బులు బాగా వస్తున్నాయి కదా అని అనుకొన్నాను. కానీ నిర్మాత వచ్చి.. సినిమా పేరు భైరవి అన్నారు. దాంతో నేను ఆ సినిమాను ఒప్పుకొన్నాను.

ఎన్టీఆర్‌ను ప్రత్యక్షంగా చూసి: తెర మీద చూసిన ఎన్టీఆర్‌ను బెంగళూరులో ఓ సినిమా ఫంక్షన్‌లో నిజంగా చూశాను. అప్పుడు వేలాది మంది జనం కిక్కిరిసిపోయారు. ఎన్టీఆర్, అంజలి వచ్చారు. ఎలాగోలా కోతిలా గోడ ఎక్కి నేను ఎన్టీఆర్‌ను ప్రత్యక్షంగా చూశాను. పంచెకట్టు.. కళ్లకు గ్లాసులు పెట్టుకొని ఠీవీగా ఉన్నారు. ఆ తర్వాత శ్రీ కృష్ణ పాండవీయంలో దుర్యోధనుడి పాత్రలో ఎన్టీఆర్ చూసి మంత్రముగ్దుడినయ్యాను అని రజనీకాంత్ చెప్పారు.

ఎన్టీఆర్‌తో టైగర్ సినిమాలో: నేను ఆర్టీసీ కండక్టర్‌గా ఉద్యోగం చేసే సమయంలో నాటకాల పోటీ నిర్వహించారు. అప్పుడు నేను ధుర్యోధనుడి వేషం వేసి చెప్పిన డైలాగ్స్‌కు చప్పట్లు వర్షం కురిసింది. ఆ తర్వాత నీవు సినిమాల్లో నటించు.. ముక్కమాల, త్యాగరాజు లాంటి విలన్ అవుతావని చెప్పారు. దాంతో నేను యాక్టర్ అయ్యాను. 1977లో ఎన్టీఆర్‌తో టైగర్ సినిమాలో నటించాను అని రజనీకాంత్ గుర్తు చేసుకొన్నారు.


Click it and Unblock the Notifications











