కర్ణాటక అడవుల్లో బేర్ గ్రిల్స్.. అప్పుడు మోడీ.. ఇప్పుడు రజినీకాంత్
డిస్కవరీ ఛానల్‌లో ప్రసారం అయ్యే 'మ్యాన్ వర్సెస్ వైల్డ్' కార్యక్రమంలో ఈ సారి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం కోసం బ్రిటన్ దేశానికి చెందిన సాహసవీరుడు బేర్ గ్రిల్స్ కర్ణాటక చేరుకున్నారు. బందీపూర్ అటవీప్రాంతంలో ఈ డాక్యుమెంటరీ షూటింగ్ జరగనుంది. అక్కడి టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో ఈ ఇద్దరూ కలిసి తిరగనున్నారు. ఈ రోజు (జనవరి 28) మొదలుకొని 30వ తేదీ వరకు ఈ షూట్ జరగనుంది.
బందీపూర్ అభయారణ్యంలో రెండు రోజుల పాటు ఈ అడ్వెంచర్ డాక్యుమెంటరీ చిత్రీకరణ కొనసాగుతుంది. రోజూ ఆరు గంటల పాటు మాత్రమే షూటింగ్‌ను నిర్వహించాల్సి ఉంటుందని కర్ణాటక అటవీ మంత్రిత్వ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీనికోసం కర్ణాటక అటవీ మంత్రిత్వ శాఖ అధికారులు ఏకంగా 17 నిబంధనలను విధించారు.

బేర్ గ్రిల్స్, మేన్ వర్సెస్ వైల్డ్ కార్యక్రమంలో అడవులు, నదులు, కొండల్లో తిరుగుతూ... సాహసాలు చేస్తుంటాడు. ఎలాంటి సదుపాయాలూ, ఆహారమూ లేకపోయినా అడవుల్లో, ఎడారుల్లో ఎలా బతకగలగాలో చూపిస్తుంటాడు. అందులో భాగంగా ప్రకృతిలో ఎదురయ్యే సమస్యల్ని ఎలా ఎదురించాలో వివరిస్తాడు. అందుకే ఈ షోకి మంచి ఆదరణ లభిస్తోంది.
గతేడాది ఇదే 'మ్యాన్ వర్సెస్ వైల్డ్' కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. అప్పుడు ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్ జాతీయ పార్కులో అడ్వెంచర్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ ఏడాది ఇలా రజినీకాంత్ ఈ కార్యక్రమంలో పాల్గొంటుండటం విశేషం.


Click it and Unblock the Notifications











