మోహన్ బాబును పరామర్శించిన రజనీకాంత్
తిరుపతి: సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల తండ్రిని కోల్పోయిన ప్రముఖ నటుడు మోహన్ బాబును పరామర్శించారు. మోహన్ బాబుని పరామర్శించిన వారిలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఉన్నారు. రజనీకాంత్ ఆదివారం రాత్రి శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థలకు చేరుకొని మోహన్ బాబు కుటుంబసభ్యులను రజనీకాంత్ పరామర్శించారు. ఉదయం మాజీ ఎమ్మెల్యే దేవినేని నెహ్రూ తన కుటుంబసభ్యులతో వచ్చి పరామర్శించారు. హైకోర్టు న్యాయమూర్తి సుభాష్‌రెడ్డి, లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్, బాలాజీ హేచరీస్ అధినేత సుందరనాయుడు, నిర్మాత రామకృష్ణప్రసాద్, దర్శకుడు దశరథ్‌లు మోహన్ బాబు కుటుంబసభ్యులను పరామర్శించిన వారిలో ఉన్నారు.
ప్రముఖ నటుడు, పద్మశ్రీ డాక్టర్ మోహన్ బాబు తండ్రి మంచు నారాయణస్వామినాయుడు క్రితం ఆదివారం అర్థరాత్రి తిరుపతి విద్యానికేతన్ ప్రాంగణంలో కన్నుమూశారు. వయోభారంతో ఉన్న ఆయన అర్థరాత్రి 12 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా తనువు చాలించారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మోదుగుళపాళేనికి చెందిన ఆయన ఉపాధ్యాయుడిగా విశేష సేవలందించారు. ఆయన మృతిపై మోహన్ బాబు బంధువులు, ఆత్మీయులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
నారాయణ స్వామి నాయుడు వయస్సు 95 సంవత్సరాలు. నారాయణస్వామినాయుడుకు భార్య, నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. గతంలో నారాయణస్వామి నాయుడు హెడ్‌మాస్టర్‌గా సేవలందించారు. నారాయణ నాయుడు మృతికి బంధువులు, అత్మీయులు, పలు రాజకీయవేత్తలు సంతాపం తెలిపారు. ధట్స్ తెలుగు... ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటోంది.


Click it and Unblock the Notifications











