75కిలోల బెల్లంతో తులాభారం సమర్పించిన సూపర్ స్టార్...!
తనకు అనారోగ్యం కలిగినప్పుడు పెట్టుకున్న మొక్కును తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నిన్న తిరుమల వెళ్ళి మొక్కు తీర్చుకున్నారు. తన మిత్రుడు, నటుడు మోహన్ బాబు, కుటుంబ సభ్యులతో కలిసి రజనీ వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారికి తులాభారంగా 75 కిలోల కలకండను (పటికబెల్లం) సమర్పించుకున్నారు. తర్వాత రజనీకాంత్ తీర్థ ప్రసాదంలను స్వీకరించి అరగంట పాటు గుడిలోపలే ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. తర్వాత వకుళమాతను దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. రంగనాయక మండపంలో పండితులు రజనీకాంత్, ఆయన కుటుంబ సభ్యులను, మోహన్ బాబును వేద ఆశీర్వచనం చేసి పట్టువస్త్రం బహూకరించారు. లడ్డూ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటాలను అందజేశారు. రజనీకాంత్ సతీమణి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు రజనీ కుటుంబ సభ్యులు తిరుమలకు రావడంతో వారిని చూడటానికి జనం ఎగబడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, అభిమానుల దీవెనల వల్ల, వేంకటేశుని ఆశీస్సుల వల్ల తాను పూర్తి ఆరోగ్యాన్ని పొందానని చెప్పారు. మరో రెండు మూడు నెలల్లో 'రాణా' చిత్రం షూటింగులో పాల్గొంటానని రజనీ చెప్పారు. షారుక్ నిర్మిస్తున్న 'రా.వన్' సినిమాలో గెస్ట్ పాత్ర పోషించానని అన్నారు. కాగా, రజనీ మునుపటిలానే చాలా యాక్టివ్ గా కనిపించాడు. అభిమానులకు షేక్ హ్యాన్డులిచ్చి, నవ్వుతూ పలకరించాడు.


Click it and Unblock the Notifications











